వేట్లపాలెం దుర్ఘటన : విచారణలో సంచలన విషయాలు!
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా పేలుడుకు సంబంధించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.;
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా పేలుడుకు సంబంధించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 23 మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న ఘటనకు బాణా సంచా తయారీ కేంద్రంలో ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణమంటున్నారు. ప్రధానంగా బాణాసంచా దుకాణ యజమాని అడ్డగోలు తనం కూడా ఘటనకు ప్రధాన కారణమని అంటున్నారు. ఘటనా స్థలంలో సుత్తులు, హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్లు లభ్యం కావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
15 కిలోలకు మించి మందుగుండు నిల్వ చేయకూడని స్థలంలో క్వింటాళ్ల కొద్ది మందుగుంగు నిల్వ చేశారని చెబుతున్నారు. ప్రమాద సమయంలో సుత్తులు, డ్రిల్లింగ్ మిషన్లు వాడటం వల్ల నిప్పు రవ్వలు పుట్టుకొచ్చి ఉంటాయని, ఇదే పేలుడుకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మందుగుండు కూరేందుకు వీటిని వినియోగించినట్లుగా భావిస్తున్నారు. జగ్గంపేట మండలం గోకవరంలో జరిగే జాతరకు భారీగా ఆర్డర్లు రావడంతో శనివారం ప్రమాదం జరిగిన శ్రీసూర్య ఫైర్ వర్క్స్ కేంద్రంలో భారీగా తారాజువ్వలు, రంగుల చిచ్చుబుడ్లు, నారబాంబులు తయారు చేసినట్లు చెబుతున్నారు.
బాంబుల్లో దట్టంగా మందుగుండు కూరేందుకు చేతి డ్రిల్లింగ్ యంత్రాలను ఉపయోగిస్తారు. గట్టిదనం కోసం వాటిపై సుత్తులతో బాదుతారు. బాదినప్పుడు నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించి భారీ పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిబంధనల ప్రకారం బాణాసంచా తయారీ కేంద్రంలో సుత్తులు, డ్రిల్లింగ్ మిషన్ల వినియోగం నిషిద్ధం. కానీ, శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా వీటిని ఉపయోగించారని చెబుతున్నారు. నైపుణ్యం లేని కార్మికులు వీటిని వాడటం కూడా ప్రమాదానికి దారితీసినట్లుగా భావిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో సోమవారం ఇవి వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు.
ఇక ప్రమాదంలో ఎక్కువ సంఖ్యలో ప్రాణ నష్టానికి కూడా నిబంధనల అతిక్రమణే కారణమని అధికారులు చెబుతున్నారు. కేవలం 8 మంది పనిచేయాల్సిన చోట 30 మందికి పైగా కూలీలను పెట్టారని చెబుతున్నారు. ఈ కారణంగానే పేలుడు వల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందని అంటున్నారు. శ్రీసూర్య ఫైర్ వర్క్స్ లో ఎప్పుడూ 50 మంది పనిచేసేవారని, కానీ ఆ రోజు పెన్షన్ల కారణంగా కొందరు పనికి రాకపోవడం వల్ల ప్రాణనష్టం కొంతవరకు తగ్గిందని అంటున్నారు. మరోవైపు ఘటనకు అధికారుల బాధ్యత రాహిత్యం కూడా కారణమని ప్రభుత్వం భావించింది. బాణాసంచా దుకాణాల పర్యవేక్షణపై నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులపై వేటు వేసింది.