వైసీపీలో `కాల‌నీల‌` క‌థ‌.. నేత‌ల ఆధిప‌త్యం ఎందుకు..?

Update: 2021-09-20 23:30 GMT
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న జ‌గ‌న‌న్న కాల‌నీల నిర్మాణం.. నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు పెంచుతోంది. అదే స‌మ‌యంలో పార్టీకి స‌రికొత్త త‌ల‌నొప్పులు తెస్తోంది. పార్టీలో ఎమ్మెల్యేలు.. రోడ్డున ప‌డే వ‌ర‌కు వివాదాలు న‌డుస్తున్నాయి. అంతేకాదు.. హ‌ద్దులు దాటి మ‌రీ వ్యాఖ్య‌లు చేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో ఇప్ప‌టికే ఉన్న ఆధిప‌త్య పోరుకు ఈ ప‌రిణామం మ‌రింతగా ఆజ్యం పోసిన‌ట్టు అవుతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.  విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రంలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. జ‌గ‌న‌న్న కాల‌నీల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం సంక‌ల్పించింది.

ఇల్లు లేని పేద‌ల‌కు ఇల్లు నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 30 ల‌క్ష‌ల మందికి (ముఖ్య‌మంత్రి జ‌గ‌నే చెప్పిన‌ట్టు) ఇళ్ల స్థ‌లాల‌ను కూడా ప్ర‌భుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించి సొంతగా ఇల్లు నిర్మించుకునేవారికి ప్ర‌భుత్వ‌మే ప్రోత్సాహ‌కంగా కొంత సామాగ్రి అందిస్తోంది. తాజాగా రూ.35 వేల అప్పును పావ‌లా వ‌డ్డీకే అందిస్తున్న‌ట్టు తెలిపింది.  అదే స‌మ‌యంలో ఖ‌ర్చును కూడా రీయింబ‌ర్స్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో కొంద‌రు ల‌బ్ధిదారులు సొంత‌గానే శంకుస్థాప‌న‌లు  చేసుకుని.. ఇళ్లు క‌ట్టుకుంటున్నారు. అయితే.. మ‌రికొంద‌రు ల‌బ్ధిదారులు ప్ర‌భుత్వం క‌ట్టిస్తేనే.. త‌ప్ప త‌మ‌కు అవ‌కాశం లేద‌ని తెలిపారు.

దీంతో ప్ర‌భుత్వ‌మే.. వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌, నిర్మాణ సామాగ్రి ఏర్పాటు వంటి బాధ్య‌త‌ల‌ను జిల్లాల ఇంచార్జ్ మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా అప్ప‌గించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డే ఎమ్మెల్యేల ఆధిప‌త్య పోరు ప్రారంభ‌మైంది. ఎలాగంటే.. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న పేద‌ల‌కు.. స‌మీప‌ నియోజ‌క‌వ‌ర్గంలో అంటే.. స్థ‌లాలు ఎక్క‌డ అనువుగా ఉంటే.. అక్క‌డ ప్ర‌భుత్వం జ‌గ‌న‌న్న ఇళ్ల కింద సెంటు, సెంటున్న‌ర చొప్పున స్థ‌లాల‌ను కేటాయించింది. దీంతో అక్క‌డ  ప‌నులు చేప‌ట్టాల్సి ఉంది. దీనిని బ‌ట్టి.. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు..వేరే నియోజ‌క‌వ‌ర్గంలో కేటాయించిన చోట ప‌నులు చేప‌డుతున్నారు.

ఈ ప‌రిణామ‌మే ఇప్పుడు ఎమ్మెల్యేలకు, మంత్రుల‌కు, ఎంపీల‌కు మ‌ధ్య  ఆధిప‌త్య పోరుకు కార‌ణ‌మైంద‌నే వాద‌న వినిపిస్తోంది. ``మా నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు పొరుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఇళ్లు కేటాయించారు. వారికి నాణ్య‌మైన సామ‌గ్రి అప్ప‌గించి.. నాణ్య‌మైన ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త నాదే`` అని ఒక ఎమ్మెల్యే అంటే.. `` అలా ఎలా కుదురుతుంది?  వారికి నా నియోజ‌క‌వ‌ర్గంలో స్థ‌లాల‌ను కేటాయించారు కాబ‌ట్టి.. ఇక్క‌డ నేను చెప్పిందే జ‌ర‌గాలి`` అని ఇవ‌త‌లి ప‌క్షం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, కొన్ని కొన్ని చోట్ల ఎంపీలు చెబుతున్నారు. దీంతో వివాదాలు తార‌స్తాయికి చేరుతున్నారు.

దీంతో వీరిని స‌ర్ది చెప్ప‌లేక‌..  ఇంచార్జ్ మంత్రులు న‌లిగిపోతున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేల‌కు ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య వివాదాల‌ను స‌రిదిద్ద‌లేక‌పోతున్నారు. ఇది మ‌రింత ముదిరితే.. పార్టీకే న‌ష్ట‌మ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. కొన్ని చోట్ల ఈ వివాదాల కార‌ణంగా. ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. ఇటీవ‌ల గుంటూరులోని తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఇదే జ‌రిగింది. దీంతో ప‌రిస్థితిని స‌ర్దుబాటు చేయ‌లేక‌.. ఇంచార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు ఇబ్బంది ప‌డ్డారు. చివ‌ర‌కు ఈ స‌మ‌స్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల వ‌ర‌కు చేరింది. ఈ ఒక్క జిల్లానే కాదు.. రాష్ట్రంలోని దాదాపు 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News