ఫీజులు చెల్లించలేదని.. ఆన్ లైన్ క్లాసులకు నో చెప్పొద్దు

Update: 2020-10-01 07:30 GMT
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కరోనా నేపథ్యంలో మూతబడ్డ స్కూళ్లు.. క్లాసుల్ని ఆన్ లైన్ లో చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. స్కూళ్ల నిర్వహణలో ప్రైవేటు స్కూళ్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులకు ఓకే చెప్పాలంటే.. ఫీజులు చెల్లించాల్సిందేనని విద్యార్థులకు స్పష్టం చేస్తున్నాయి. దీంతో.. పలు ప్రైవేటు స్కూళ్లు.. ఫీజులు చెల్లించని విద్యార్థులను ఆన్ లైన్ క్లాసులకు అనుమతించటం లేదు.

ఈ నేపథ్యంలో సికింద్రాబాద్లోని సెయింట్ లూయిస్.. సెయింట్ ఆండ్రూస్.. బోయిన్ పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ సంస్థలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాల్ని వెలువరించింది. ఫీజుల బూచిని చూపించి విద్యార్థుల్ని ఆన్ లైన్ క్లాసులకు నో చెప్పొద్దని.. వార్షిక పరీక్షల కోసం వారి పేర్లను రిజిస్టర్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

కరోనా నేపథ్యంలో స్కూళ్ల ఫీజులు పెంచకూడదని.. ఏ నెల ఫీజులు ఆ నెల చెల్లించాలని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ట్యూషన్ ఫీజు మినహా మరే ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని సర్కారు చెబితే.. అందుకు భిన్నంగా ఆడ్మిషన్ ఫీజుతో పాటు ట్యూషన్ ఫీజు చెల్లించాలని.. ఒకేసారి పే చేయాలని కొన్ని స్కూళ్లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన కోర్టు.. వార్షిక ఫీజులో 50 శాతం ఒకసారి.. మిగిలిన మొత్తాన్ని నెలవారీగా చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అప్పీలు చేయగా.. తాజాగా మరికొన్ని ఆదేశాల్ని జారీ చేశారు. దీని ప్రకారం.. ఫీజులు చెల్లించని కారణంగా ఆన్ లైన్ క్లాసులకు పిల్లల్ని అనుమతించకుండా ఉండటం సరైన పద్దతి కాదని.. తప్పనిసరిగా అనుమతించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రైవేటు స్కూళ్లకు కొత్త ఇబ్బందుల్ని.. తీవ్రమైన ఆర్థిక సమస్యల్ని తీసుకొస్తుందన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News