జేసీ మనసు దోచుకున్న కొత్త రైలు

Update: 2016-07-13 07:12 GMT
హుషారుగా ఉండటమే కాదు.. అందుకు తగ్గట్లే ఎలాంటి మొహమాటం లేకుండా ఫైర్ అయ్యే తెలుగుదేశం నేతల్లో జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో సాగిన ఆయన ప్రయాణంలో ఎలా అయితే ఉండేవారో.. అదే తీరులో టీడీపీలో కూడా ఉండటం జేసీకే చెల్లుబాటు అవుతుందని చెప్పాలి. అధినేత పట్ల అభిమానం ఉన్నప్పటికీ.. తాను అనుకున్నది అనుకున్నట్లు మాట్లాడేందుకు ఏ మాత్రం మొహమాటపడని జేసీ తాజాగా మాత్రం చాలా ఖుషీ.. ఖుషీగా ఉన్నారు.  తాజాగా ఏపీ రాజధాని విజయవాడ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరం వరకూ కొత్త ట్రైన్ ను షురూ చేయటం తెలిసిందే. వారానికి మూడు రోజులు నడిచే ఈ కొత్త  రైలు మంగళవారం మొదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కొత్త ట్రైన్ ధర్మవరానికి చేరుకుంది.

విజయవాడలో స్టార్ట్ అయినప్పుడు అక్కడి నేతలు దాన్ని ఘనంగా సాగనంపితే.. తన ఇలాకకు వచ్చిన కొత్త రైలుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం.. కొత్త రైలును లోపలికి వెళ్లి మరీ చెక్ చేశారు. అన్ని బోగీలు కొత్తగా ఉండటంతో పాటు.. కొత్త టెక్నాలజీతో తయారు చేసిన బోగీల్ని ఈ రైలు బండికి కేటాయించటంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఇలాంటి రైలుబండి కోసం సీమ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.
Read more!

ఇకపై రాత్రిళ్లు రాజధానికి బయలుదేరి.. పొద్దున్నే బెజవాడకు చేరుకొని.. పనులు పూర్తి చేసుకొని మళ్లీ అదే రైలులో రాత్రికి బయలుదేరొచ్చని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. కొత్త రైలుబండి జేసీ మనసును బాగానే దోచుకున్నట్లుగా ఉంది. ఇక.. ఈ కొత్త ట్రైన్ విశేషాలు చూస్తే.. విజయవాడ నుంచి ప్రతి సోమ.. బుధ.. శనివారాల్లో బయలుదేరుతుంది. విజయవాడ స్టేషన్ నుంచి రాత్రి 11.10 గంటలకు బయలుదేరి పక్కరోజు ఉదయం 10.40 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. గంటకు 44.06 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ ట్రైన్ నెంబరు 17215.

ఇక.. ధర్మవరం నుంచి మంగళవారం.. గురువారం.. ఆదివారాల్లో సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరే ఈ ట్రైన్ పక్కరోజు ఉదయం 6.50 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. విజయవాడ నుంచి బయలుదేరే ట్రైన్ తో పోలిస్తే.. ధర్మవరం నుంచి బయలుదేరే ట్రైన్ గంటకు 39.46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించటం గమనార్హం. ఇక.. విజయవాడ నుంచి బయలుదేరే ఈ కొత్త రైలు గుంటూరు.. నర్సరావు పేట.. వినుకొండ.. మార్కాపురం రోడ్డు.. గిద్దలూరు.. నంద్యాల.. డోన్.. గుత్తి.. అనంతపురం స్టేషన్లలో ఆగుతుంది. రిటర్న్ జర్నీలోనూ ఇవే స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగనుంది.
Tags:    

Similar News