సీఎం ప‌ద్ద‌తి మార్చుకోకుంటే భ‌విష్య‌త్‌ లో క‌ష్టాలే

Update: 2017-08-15 06:36 GMT
త‌మిళనాడులో అధికార అన్నాడీఎంకేలో మ‌రో కొత్త ప‌రిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే వైరి వర్గం అధినేత్రి శశికళ సోద‌రి కుమారుడు టీటీవీ దినకరన్ త‌న బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌ను ప‌రోక్షంగా చాటుకున్నారు. మదురైలోని మేలూరులో భారీ ర్యాలీ నిర్వహించిన దిన‌క‌ర‌న్ త‌న స‌త్తా చాటి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ఎపిసోడ్‌ లో భాగంగా ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామిని హెచ్చ‌రించే ప్ర‌య‌త్నం చేసిన దిన‌క‌ర‌న్‌...కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని మాత్రం ప‌ల్లెత్తి మాట అన‌కుండా ఉండ‌టం ఆస‌క్తిక‌రం. ఓపక్క రెండు వర్గాలకు మధ్య రాజీ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ ర్యాలీలో 20మంది పార్టీ ఎమ్మెల్యేలు - నలుగురు ఎంపీలు పాల్గొన్నారు.

దాదాపు 22వేలమంది హాజరైన ఈ ర్యాలీలో మాట్లాడిన దినకరన్ ‘శశికళ పదవీత్యాగం చేసిన రాణి’ అని అభివర్ణించారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం - ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామికి పదవులు కట్టబెట్టింది తమ కుటుంబమేనని ఈ సందర్భంగా దినకరన్ వెల్లడించారు. జయలలిత మరణించిన రోజునే కావాలనుకుంటే శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఉండేవారని పేర్కొన్న ఆయన తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికీ కూడా పదవులు అప్పగించడానికి శశికళ మొగ్గు చూపలేదని తెలిపారు. ఆనాడు తాము పార్టీని వదిలేసి ఉంటే ఇవాళ పదవుల్లో తిరుగుతున్నవారికి ఈ అవకాశమే దక్కి ఉండేది కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి అడ్డుకోకపోయివుంటే ఈ ర్యాలీకి మరింతమంది హాజరై ఉండేవారని దినకరన్ తెలిపారు.

పార్టీ డిప్యూటీ కార్యదర్శిగా తనను తొలగిస్తూ తీర్మానం చేసేముందు అన్నాడీఎంకే సీనియర్ సభ్యులను సంప్రదించలేదని దిన‌క‌ర‌న్ మండిప‌డ్డారు. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి పళనిస్వామి వర్గానికి నేరుగానే హెచ్చరికలు జారీచేసిన ఆయన ‘పద్ధతి మార్చుకోండి లేదా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుంది’ అని హెచ్చరించారు. ఈ ర్యాలీ సంద‌ర్భంగా బీజేపీపై నేరుగా విమర్శలు చేయకుండా దినకరన్  జాగ్రత్త పడ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News