గవర్నరే గెలిచారా ?

Update: 2021-11-18 00:30 GMT
తెలంగాణాలో కేసీయార్ ఎంపిక చేసిన 6మంది ఎంఎల్సీల విషయం చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఎంఎల్ఏల కోటాలో తాజాగా కేసీయార్ ఎంపిక చేసిన ఆరుగురు నేతల్లో కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదే రెడ్డిని హుజూరాబాద్ ఎన్నికలకు ముందు కేసీయార్ గవర్నర్ కోటాలో ఎంఎల్సీని చేయాలని మంత్రివర్గంలో తీర్మానం చేశారు. అలాగే ఫైలును గవర్నర్ తమిళిసైకి పంపారు. మామూలుగా అయితే సీఎం పంపిన ఫైలుకు అదే రోజు గవర్నర్ ఆమోదముద్ర వేసేస్తారు.

కానీ కౌశిక్ నియామకానికి సంబంధించిన ఫైలు మాత్రం గడచిన రెండున్నర నెలలుగా గవర్నర్ కార్యాలయంలోనే పెండింగ్ లో ఉండిపోయింది. అదే నేతను కేసీయార్ ఎంఎల్ఏల కోటాలో ఎంఎల్సీకి నామినేట్ చేశారు కాబట్టి ఇక గవర్నర్ దగ్గర ఫైలు మురిగిపోయినట్లే. అంటే తెరవెనుక ఏమి జరిగిందో స్పష్టంగా ఎవరికీ తెలియదుకానీ తన కోటాలో రెడ్డిని ఎంఎల్సీగా నామినేట్ చేసే విషయంలో గవర్నర్ అడ్డుకున్నారనే అనుకోవాలి.

మహారాష్ట్రలో కూడా ఇలాగే జరిగింది. ప్రభుత్వం పంపిన 8మంది నేతల పేర్లకు గవర్నర్ క్లియరెన్సే ఇవ్వలేదు. ఇదే విషయమై మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు కూడా వెళ్ళింది. అయినా గవర్నర్ పట్టించుకోలేదు. సీఎం ప్రతిపాదిస్తే గవర్నర్ అడ్డుకోవటం అన్నది మామూలుగా జరగదు. అయితే ఏదైనా స్పష్టమైన అజెండా ఉంటే మాత్రమే ఇలా జరుగుతుంటుంది. ఒకవేళ గవర్నర్ సదరు ఫైలును రెజెక్టు చేస్తే అది వేరే సంగతి. గవర్నర్ రెజెక్టు చేసిన పేర్లతోనే ప్రభుత్వం రెండోసారి కూడా ఫైలుపంపితే ఆమోదం తెలపటం తప్ప గవర్నర్ కు వేరే దారిలేదు.
Read more!

అందుకనే ఫైలును రెజెక్టు చేయకుండా తమ వద్దే గవర్నర్లు పెండింగ్ లో ఉంచుతున్నారు. మీడియా సమావేశంలో కూడా ఇదే విషయమై గవర్నర్ తమిళిసై మాట్లాడుతు ఆ ఫైలు తన పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. చివరకు ఇపుడా ఫైలుపై పరిశీలనకు అవసరమే లేకుండా పోయింది. తెరవెనుక ఏమి జరిగినా అందరికీ కనబడుతున్నది మాత్రం కౌశిక్ రెడ్డి నియామకం విషయంలో గవర్నరే గెలిచారని. మరి గవర్నర్ కోటాలో కేసీయార్ మళ్ళీ ఎవరి పేరును ప్రతిపాదిస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News