దేవినేని ఉమను మీడియా పట్టించుకోవడం లేదా?

Update: 2019-10-14 07:32 GMT
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పడు బాగా హడావుడి చేసిన వారిలో దేవినేని ఉమా మహేశ్వరరావు ఒకరు. చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుడిగా ఈయన వ్యవహరించారు. కీలకమైన సాగునీటి వ్యవహారాల శాఖను చూశారు. అయితే ఆ శాఖా మంత్రిగా దేవినేని ఉమ చేసిన ప్రకటనలు పార్టీకి లాభం చేకూర్చడం మాట అటుంచి - తీవ్రమైన నష్టాన్ని చేకూర్చాయి అనేది ఒక పరిశీలన.

రెండు వేల పద్దెనిమిదికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ అసెంబ్లీలో ప్రకటన చేసిన వ్యక్తి దేవినేని. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి..'రాసుకో జగన్..' అంటూ వ్యాఖ్యానించాడు ఉమ. అలా సవాల్ విసిరిన దేవినేని ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు. తీవ్రంగా అభాసుపాలయ్యాడు.

'రాసుకో.. రాసుకో..' అన్నవ్యక్తి ఇప్పుడు కనిపించడం లేదంటూ అసెంబ్లీలో అంబటి రాంబాబు వ్యంగ్యంగా  వ్యాఖ్యానించారు కూడా. ఇలాంటి నేఫథ్యంలో మీడియాలో కూడా దేవినేని ఉమ గురించి రాసుకోవడానికి ఏమీ లేకుండా పోతోందని తెలుస్తోంది. దేవినేని ఉమను  మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదు.

ప్రతిపక్షంలోకి వచ్చాకా కూడా మొదట్లో కొంత హడావుడి చేశారు ఉమ. అయితే ఆ తర్వాత ఆయన అలికిడి లేదు. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్  టెండరింగులతో దూసుకుపోతూ ఉంది. వందల కోట్ల రూపాయల వ్యయాన్ని తగ్గించినట్టుగా ప్రకటనలు చేస్తూ ఉంది.

చంద్రబాబు నాయుడు హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మెజారిటీ డబ్బు కమిషన్ల రూపంలోనే వెళ్లేదని, దీంతో అప్పుడు వ్యయం బాగా పెరిగిందని, ఇప్పుడు ఆ కమిషన్లు లేవు కాబట్టి.. వ్యయం బాగా తగ్గుతోందని జగన్ ప్రభుత్వం వాదన వినిపిస్తోంది.

ఇలాంటి సమయంలో కూడా దేవినేని దూకుడు ముందుకు రావడం లేదు. మీడియా కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. దీంతో దేవినేని అప్పుడు కమిషన్లు పొందినది నిజమేనా? అనే సందేహాలు కూడా సామాన్య ప్రజల్లో కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News