పవన్ కు మద్దతు పలికిన మాజీ ప్రధాని!

Update: 2016-08-29 05:09 GMT
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని కేంద్రప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలో నాటి కేంద్రప్రభుత్వం అయిన కాంగ్రెస్ ను - నేటి బీజేపీని - టీడీపీ ఎంపీలను ఫుల్ గా కడిగిపారేశారు. దీంతో అన్ని పార్టీల నాయకులు పవన్ పై విమర్శలు చేయడం మొదలెట్టేశారు. ఈ క్రమంలో ప్రవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటిస్తున్నారు మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ్. విజయవాడ నగరంలోని ఒక జ్యూవెల్లర్స్ షాప్ ఓపెనింగ్ కి వచ్చిన ఈ మాజీ ప్రధాని ఈ మేరకు కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందేనంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన గళం వినిపించిన అనంతరం మాజీ ప్రధాని దేవేగౌడ్ ఈ వాదనకు మద్దతు ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా కచ్చితంగా ఇవ్వాల్సిందేనని, పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, ఈ విషయాన్ని నేటి ప్రధాని మరిచిపోకూడదని దేవెగౌడ స్పష్టం చేశారు. ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా కాకుండా, దేశ ప్రధానిగా మన్మోహన్ ఇచ్చిన హామీని, చేసిన వాగ్ధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఏపీకి హోదా ఇవ్వలేమని చెప్పలేదని చెబుతున్న దేవెగౌడ.. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రానికి ఉన్న ఇబ్బందులను చెప్పారే తప్ప... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆయన చెప్పలేదని గౌడ వ్యాఖ్యానించారు. అనంతరం పవన్ పై స్పందించిన ఈ మాజీ ప్రధాని... "యంగ్ అండ్ ఎనర్జిటిక్ లీడర్ పవన్.. అతని ప్రయత్నాన్ని అనుమానించనవసరం లేదు.." అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా... ఇటీవల దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. పవన్ ను కలవడం, అతని కుమారుడి సినిమా ప్రవేశంపై చర్చించేందుకేనని చెప్పడం తెలిసిందే. కాగా కుమార స్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి "జాగ్వర్" అనే సినిమాతో కన్నడ, తెలుగు భాషల్లో హీరోగా నటించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
Tags:    

Similar News