అమ్మ సీటులో ర‌చ్చ‌ర‌చ్చ అవుతోంది

Update: 2017-03-18 15:35 GMT
త‌మిళ‌నాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్‌ కె నగర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఇపుడు త‌మిళ ఎన్నిక‌ల‌లో హాట్ కేక్ అయింది. ఏప్రిల్ 12న జరగనున్న ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ స‌మ‌యంలోనే ఆస‌క్తిక‌ర‌మైన రాజ‌కీయాలు సైతం తెరమీద‌కు వ‌చ్చాయి. అన్నాడీఎంకే అస‌లైన వార‌సురాలిగా చెప్పుకొంటున్న పార్టీ ప్రధాన కార్యదర్శి శ‌శిక‌ళ‌ త‌న మేనల్లుడు టీటీవీ దినకరన్ అధికార పక్షం నుంచి రంగంలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌ సెల్వం నేతృత్వంలో అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం తమ అభ్యర్థిగా ఇ. మధుసూదనన్‌ ను ప్రకటించింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన డీఎంకే త‌ర‌ఫున‌ న్యాయవాది ఎన్. మరుతు గణేశ్  ఇప్పటికే పోటీకి దిగారు. మ‌రోవైపు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సైతం తన ‘ఎంజిఆర్ అమ్మ దీపా పరవై’ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు.  దీప భ‌ర్త మాధ‌వ‌న్ సైతం వేరే పార్టీ పెట్టి త‌మ అభ్య‌ర్థిని బ‌రిలో దింపుతామ‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.

జయలలిత వారసులం తామే నంటూ ‘అమ్మ’ పేరుతో ముగ్గురు అభ్యర్థులు దీపా జయకుమార్, దినకరన్, మధుసూదనన్ ముక్కోణపు పోటీకి దిగారు. అన్నాడీఎంకె అభ్యర్థిగా దినకరన్ పేరు వెల్లడైన కొన్ని గంటలకే మరుతు గణేశ్‌ను తమ అభ్యర్థిగా డీఎంకె ప్రధాన కార్యదర్శి కె. అన్బళగన్ ప్రకటించారు. డీఎంకె పోటీకి నిలిపిన మరుతు గణేశ్ స్థానిక న్యాయవాదిగా, పాత్రికేయునిగా సేవలందించారు. ఆయన కొంత కాలంగా ఆర్‌కె నగర్‌లో పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు అయిన‌ రెండు ఆకులు తమకే సొంతమని ఇటు శశికళ, అటు పన్నీర్ సెల్వం వర్గాలు పేర్కొంటున్నాయి. రెండాకుల గుర్తు తమకు దక్కకపోతే జయలలిత గతంలో పోటీ చేసిన కోడిపుంజు గుర్తును ఎంచుకునేందుకు పన్నీర్ వర్గం మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. ఇదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్న దీపా జయ కుమార్ సైతం కోడిపుంజు గుర్తునే కోరుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ఊపుమీదున్న భారతీయ జనతా పార్టీ సైతం ఆర్‌కే నగర్ ఉప ఎన్నికలో నటి గౌతమిని బరిలోకి దించాలని యోచిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు మార్చి 23, పరిశీలన 24, ఉప సంహరణ 27 తేదీలుగా ఖరారు కాగా పోలింగ్ ఏప్రిల్ 12న, ఓట్ల లెక్కింపు 15న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేసే ప్రముఖుల వివరాలను కూడా మార్చి 23లోపు సమర్పించాలని ఎన్నికల సంఘం అభ్యర్థులను కోరింది. జ‌య‌లలిత 2016 డిసెంబర్ 5న కన్నుమూయడంతో ఖాళీ అయిన ఆర్‌కె నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. అన్నాడెఎంకె పార్టీ చిహ్నం రెండాకులు కింద పోటీ చేయనున్నాని, మార్చి 23న తన నామినేషన్ పేపర్లు దాఖలు చేయనున్నానని దినకరన్ తెలిపారు. ఎంత మంది పోటీ చేసినా కనీసం 50 వేల మెజారిటీతో నెగ్గుతానన్న ధీమాను దినకరన్ వ్యక్తం చేస్తున్నారు. రెండాకుల గుర్తును ఎవరికి ఇవ్వాలన్న నిర్నయాన్ని ఇంకా ఎన్నికల సంఘం వెల్లడించలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News