దీప తెలివిగా వెనక్కి తగ్గారా?

Update: 2016-12-29 08:03 GMT
తనది కానీ టైంలో తొందరపడటం మంచిది కాదని.. దానివల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదన్న విషయాన్ని గుర్తించినట్లుగా కనిపిస్తోంది జయలలిత మేనకోడలు దీప. అమ్మ వారసత్వం కోసం ఆమె పడుతున్న తపన అంతా ఇంతా కాదు. అమ్మ మరణం తర్వాత.. చిన్నమ్మ అధిపత్యాన్ని.. అధికార దండాన్ని చేపట్టానికి చేస్తున్న ప్రయత్నాల్ని కాస్తోకూస్తో అడ్డుకునే ప్రయత్నాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా? అంటే అది దీపననే చెప్పాలి. అలాంటి దీప నుంచి తాజాగా విడుదలైన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాను రాజకీయాల్లో వచ్చే విషయమైన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. అమ్మ తర్వాత చిన్నమ్మ కాదు.. దీపనే అంటూ అన్నాడీఎంకే నేతలు పలు చోట్ల బ్యానర్లు.. ఫ్లెక్సీలు కట్టిన పరిస్థితి. దీని వెనుక ఆమె ప్రమేయం ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని బహిరంగ రహస్యంగానే ఉంచేసిన ఆమె.. తాజాగా మాత్రం తన కటౌట్లు.. బ్యానర్లు పెట్టటం ఆపాలంటూ ఆమె కోరారు.

విపత్కర పరిస్థితుల్లో నిజమైన అన్నాడీఎంకే కార్యకర్తలు శాంతంగా ఉంటారని చెప్పిన దీప.. తనకుఅండగా నిలిచిన నేతలు.. కార్యకర్తలకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. తన మేనత్త మృతితో సంతాపంలో ఉన్నానని.. తనకు కొంత సమయం ఇవ్వాలన్న ఆమె.. సమీప భవిష్యత్తులో సరైన నిర్ణయాన్ని తీసుకుంటానని చెప్పారు. అమ్మ ఆశీస్సులతో తాను ముందుకు సాగుతానని చెప్పిన ఆమె.. మేనత్త తరహాలోనే తమినాడును సరైన దారిలో నడిపేందుకు కృషి చేస్తానని ప్రకటించటం గమనార్హం.
Read more!

తనకు తానుగా వెనక్కి తగ్గిన దీప తీరు చూస్తే.. తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కనిపించక మానదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నమ్మతో పోలిస్తే.. తన బలం పరిమితమన్న విషయాన్ని దీప అర్థం చేసుకోవటమే కాదు.. చిన్నమ్మను అమితంగా అభిమానించేవారు తన ఎంట్రీని విజయవంతంగా అడ్డుకోవటం ఖాయమని.. అది తనకు అవమానకరంగా మారే ప్రమాదం ఉందన్న అంచనా వేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటివి.. తన భవిష్యత్తు అవకాశాలకు ఇబ్బందిగా మారతాయన్న ఆలోచనతోనే ఆమె వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. వాతావరణం అనుకూలంగా లేని వేళ ఆవేశపడటం కంటే ఆలోచనతో వెనక్కి తగ్గటమే మంచిది
Tags:    

Similar News