టీఆర్ ఎస్ ను వీడకుండా దెబ్బేస్తున్న డీఎస్

Update: 2019-07-12 04:39 GMT
డీఎస్.. డీ. శ్రీనివాస్. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో పీసీసీ చీఫ్ గా అన్నీ తానై వ్యవహరించిన నేత. బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన ఈయన అప్పట్లో టీఆర్ ఎస్ - కాంగ్రెస్ పొత్తుకు తోడ్పడ్డారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయగల సామర్థ్యం ఈయన సొంతం. అయితే తదనంతర కాలంలో టీఆర్ ఎస్ లో చేరారు. సీనియర్ కావడంతో కేసీఆర్ రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు.

కానీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు ముందే టీఆర్ ఎస్ తో డీఎస్ దోస్తీ చెడింది. నిజామాబాద్ లో టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేసీఆర్ కూతురు కవితకు వ్యతిరేకంగా తన అనుచరులు - నాయకులను ఆయన ఉసిగొల్పుతున్నారని గులాబీ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని కోరారు. అయితే కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం వహించి ఆయనను పార్టీకి దూరంగా పెట్టారు. సస్సెండ్ చేస్తే ఆయన రాజ్యసభ సీటులోనే కొనసాగుతారు. ఆయన వేరే పార్టీలో చేరితే అనర్హత వేటు వేద్దామని వేచిచూశారు.

అయితే ఇక్కడే తలపండిన డీఎస్ రాజకీయం చేశారు. నిజామాబాద్ లో కేసీఆర్ కూతురు కవిత ఓడిపోయింది. ఈయన కుమారుడు అరవింద్ బీజేపీ ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న టీఆర్ ఎస్ అధిష్టానం డీఎస్ ఎప్పుడు వేరే పార్టీ కండావా వేసుకొని కనిపిస్తే అప్పుడు అనర్హత వేటు వేయించాలని కాచుకు కూర్చుంది.

అయితే డీఎస్ మాత్రం తాజాగా నిన్న టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరగగా దానికి హాజరయ్యారు. ఆ తర్వాత అమిత్ షాను కలిసి చర్చలు జరిపారు. కానీ బీజేపీలో చేరుతున్నట్టు చెప్పలేదు. సీనియర్ అయిన డీఎస్ ను పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీలో చేరితే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఎసరువస్తుంది. టీఆర్ ఎస్ అనర్హత వేటు వేస్తుంది. అందుకే అటు బీజేపీకి పనిచేస్తూనే ఇటు రాజ్యసభ సీటును వదలకూడదని భావించి డీఎస్ ఢిల్లీలో టీఆర్ ఎస్ సభ్యుడిగానే ఉంటూ బీజేపీ తరుఫున పనిచేస్తున్నారు. తాజాగా అమిత్ షాతోనూ అలాగే భేటి అయ్యారు.

ఇలా పదవి పోకుండా.. టీఆర్ ఎస్ పనిపడుతూ బీజేపీతో సాన్నిహిత్యం నడుపుతున్న డీఎస్ వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి కేసీఆర్ కే చుక్కలు చూపిస్తున్న డీఎస్ ఇప్పుడు బీజేపీకి దగ్గరవ్వడంతో టీఆర్ ఎస్ ఏం చేస్తుందన్న ఆసక్తి నెలకొంది.


Tags:    

Similar News