ఉత్తరకొరియాకు ఫ్రెండు దొరికింది..

Update: 2017-11-23 23:30 GMT
అగ్రరాజ్యం అమెరికాతో పెట్టుకుని పూర్తిగా దెబ్బతిన్న దేశాలు కొన్నయితే, అమెరికాను ఆటాడించిన దేశాలు మరికొన్ని. చూడ్డానికి చిన్నగా ఉన్నా అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన దేశాల్లో వియత్నం, క్యూబా కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తరకొరియా గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అయితే.. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఉ.కొరియాతో స్నేహంగా ఉండేందుకు మాత్రం మిగతా దేశాలేవీ ముందుకు రావడం లేదు. ఉత్తర కొరియాతో సఖ్యంగా ఉంటే అమెరికా తమనూ టార్గెట్ చేస్తుందని భయపడుతున్నారు. కానీ... లాటిన్ అమెరికా దేశం క్యూబా మాత్రం అదేమీ లేకుండా ఉత్తర కొరియా నేతలతో సమావేశమవుతోంది. అంతేకాదు.. ఉ.కొరియాపై ఉగ్ర ముద్ర వేయడంపై మండిపడుతోంది.
    
తాజాగా ఉత్తరకొరియా విదేశాంగమంత్రితో క్యూబా విదేశాంగ శాఖా మంత్రి సమావేశమయ్యారు. ఇరుదేశాల నేతలు అమెరికా విధానాన్ని ఖండించారు. అమెరికా ఏకపక్ష - నిర్హేతుకమైన డిమాండ్లను ఖండిస్తున్నామని ఉమ్మడి ప్రకటన చేశారు. ఎలాంటి చర్చలు లేకుండా ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల సరసన ఉత్తరకొరియాను చేర్చడం, పలు ఐరాస ద్వారా ఆర్థిక ఆంక్షలు విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
    
దీంతో ప్రపంచ దేశాల మధ్య ఏకాకిగా మారిన ఉత్తరకొరియాకు ఓ స్నేహితుడు దొరికినట్లే. కాగా సుదీర్ఘకాలంగా అమెరికాకు కొరకరాని కొయ్యగా ఉన్న క్యూబా కొద్దికాలంగా అమెరికాతో సంబంధాలు మెరుగుపర్చుకుంటోంది. ఈ దశలో మళ్లీ ఆ దేవం ఉత్తరకొరియాకు వత్తాసు పలకడంతో అమెరికా వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News