సీపీ సజ్జన్నార్ ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు

Update: 2021-01-25 04:15 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్ అధికారులు చాలామందే ఉంటారు.  సీనియర్ అధికారులకు కొదవ లేదు. కానీ.. వారెవరికి లేని ప్రత్యేకత.. ప్రజల్లో ఇమేజ్ సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ సొంతం. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఉదంతంలో ఆయన వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తటమేకాదు.. ఆయన్ను ప్రజల్లో హీరోగా మార్చాయి. దీనికి తోడు.. ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాలు కూడా కారణంగా చెబుతారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలీసు ఉన్నతాధికారిగా ఉంటూ.. నీతి.. నిజాయితీ విషయంలో ఎవరూ వంక పెట్టలేని విధంగా.. వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా ఉండటం ఆయనలోని మరో ప్రత్యేకత. అంతేకాదు.. తన కింద పని చేసే సిబ్బంది విషయంలో ఆయన వ్యవహరించే తీరు ఆయన్ను చాలామంది అధికారులకు భిన్నంగా నిలుపుతుందని చెప్పాలి.

సైబరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిందితులకు వణుకు పుట్టటమే కాదు.. సైబర్ నేరాలకు పాల్పడే వారు దేశంలో ఎక్కడ ఉన్నా.. వెళ్లి పట్టుకొచ్చేయటం అలవాటుగా మారింది. ఇక.. నేరం చేసిన వారు ఎవరైనా సరే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి రావాలంటేనే వణుకు పుట్టేలా ఆయన పోలీసింగ్ మారిందని చెప్పాలి. ఖాకీ దుస్తుల్లో తప్పించి.. మామూలు డ్రెస్సుల్లో సజ్జన్నార్ పెద్దగా కనిపించరు.

అలాంటి ఆయన పోలీసులాఠీని వదిలి.. క్రికెట్ బ్యాట్ పట్టుకున్న తీరు అందరిని ఆకర్షిస్తోంది. ప్రతి ఏడాది నిర్వహించే సైబరాబాద్ వార్షిక స్పోర్ట్స్ మీట్ లో భాగంగా క్రికెట్ మ్యాచ్ లో సీపీ బ్యాటింగ్ సిబ్బందిలో జోష్ ను నింపింది. శాంతిభద్రతల నిర్వహణలోనే కాదు.. ఆటలోనూ తన సత్తా ఏమిటో బ్యాట్ తో చాటారు. బ్యాట్ ను ఝుళిపిస్తున్న తాజా ఫోటో చూస్తే.. ప్రొఫెషనల్ క్రీడాకారుడికి ఏ మాత్రం తగ్గని రీతిలో ఆయన స్టైల్ ఉండటం గమనార్హం.
Tags:    

Similar News