పాపం ఈటల.. ‘కరోనా’తో మళ్లీ బలి

Update: 2020-03-04 09:00 GMT
ఏ క్షణాన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ పదవి పట్టుకున్నాడో అప్పటి నుంచి ఆయన కంటి మీద కునుకు లేకుండా పోయిందట.. ప్రశాంత జీవితం లేకుండా చేస్తోందట.. ఎందుకొచ్చిన మంత్రి పదవి అనేలా సమస్యలు చుట్టుముడుతున్నాయని ఆయన కుమిలిపోతున్నట్టు ప్రచారం సాగుతోంది.

వైఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రసమితికి అసెంబ్లీ శాసనసభాపక్ష నేతగా ఈటల వ్యవహరించారు..టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత రెండో స్థానంలో ఉండేవారు ఈటల.. అప్పుడు కేటీఆర్ - హరీష్ లు రాజకీయాల్లోకి కొత్త. సో మొత్తం ఈటలనే టీఆర్ ఎస్ కు అన్నీ తానై వ్యవహరించారు. అయితే టీఆర్ ఎస్ అధికారంలోకి రావడం.. ఎంపీగా ఉన్న కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం.. ఈటల తెలంగాణ తొలి ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక మంత్రి కావడంతో ఆ హోదా పరపతి అనుభవించాడు.

అయితే రెండోసారి గద్దెనెక్కాక ఈటలను దురదృష్టం వెంటాడుతోంది. కేసీఆర్ తో విభేదాలు తలెత్తడం.. ఈటలను అసలు మంత్రివర్గంలోకే తీసుకోరని చర్చ జరిగింది. అయితే పోయిన సారి ఇచ్చిన ఆర్థిక శాఖను పక్కన పెట్టి ఈటలకు టఫ్ అయిన వైద్య ఆరోగ్య శాఖను ఇచ్చారు.

ఈ శాఖ చేపట్టిన నాటి నుంచి ఈటలకు ప్రశాంతత కరువైందన్న చర్చ సాగుతోంది. తెలంగాణలో ఈటల గద్దెనెక్కగానే డెంగ్యూ, చికెన్ గున్యా ప్రబలి చాలా మంది మరణాలు సంభవించాయి. ఈ శాఖ చూసిన ఈటల అసమర్థత అంటూ ఆడిపోసుకున్నారు. ఆ తర్వాత వైద్య పరికరాలు, ఈఎస్ఐ కుంభకోణం.. మందుల కొనుగోలు ఇలా అన్నీ ఈటల మెడకు చుట్టుకున్నాయి. ఒకనొక దశలో ఈటలను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే చర్చ కూడా సాగింది.

అయితే ఇప్పుడు మరో ఉపద్రవం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో వెలుగుచూడడం.. వైద్యఆరోగ్యశాఖ తరుఫున ఈటలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. దేశంలో ఇన్ని రాష్ట్రాలుండగా తెలంగాణలోనే వ్యాధి ప్రబలడం ఈటలకు దురదృష్టంగా మారింది. ఇలా ఒక్కటేమిటీ.. ఈటల బాధ్యత చేపట్టాక ఆయనకు ఈ శాఖ నిద్ర లేకుండా చేస్తోందన్న ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News