కొవిడ్ ఎఫెక్ట్.. సెల్ ఫోన్లు.. ఏసీలు.. ఫ్రిజ్ లు అన్నింటికి ధరాఘాతమే

Update: 2020-02-20 08:00 GMT
డిజిటల్ యుగంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిందన్న మాట చాలామంది నోట వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మాటల అర్థం అనుభవంలోకి వస్తే మాత్రమే బాగా అర్థమవుతుంది. పొరుగున ఉన్న చైనాలో కొవిడ్ వైరస్ చెలరేగి పోతున్న వేళ.. భారత్ మీద తన ప్రభావాన్ని చూపిస్తోంది. కొవిడ్ వైరస్ భారత్ లోకి అడుగుపెట్టకుండా అడ్డుకోవటంలో అంతో ఇంతో విజయం సాధించినా..దాని విపరిణామాల్ని మాత్రం అడ్డుకోలేని పరిస్థితి.

కొవిడ్ వైరస్ కారణంగా చైనా జనజీవనం మొత్తం స్తంభించి పోవటమే కాదు.. కనుచూపు మేర డ్రాగన్ దేశం కోలుకునేలా కనిపించట్లేదు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ చైనా వస్తువులు వాడటం అలవాటైన మనకు.. చైనా కిందామీదా పడుతున్న వేళ.. దాని ప్రభావం మన మీద కచ్ఛితంగా పడుతుంది కూడా. ఈ రోజున భారత్ మార్కెట్లోకి ఎలక్ట్రానిక్ వస్తువుల.. విడిభాగాలు రావాలంటే చైనా నుంచి మాత్రమే.

కొవిడ్ వైరస్ తో అక్కడి పరిశ్రమలు మూతపడటం.. రోజువారీ బతుకులు కూడా చక్కగా నడవని వేళ.. ఈ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ లాంటివి సాధ్యం కాదు. ఎప్పటికి మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు.. స్మార్ట్ ఫోన్లు.. టీవీలు.. ఫ్రిజ్ లు.. ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ తన సెల్ ఫోన్ల ధరల్ని రూ.500చొప్పున పెంచేసింది. మిగిలిన కంపెనీలు తమ వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.

విడిభాగాల ధరల మంటే తాజా పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. మొత్తంగా ఎలక్ట్రానిక్ వస్తువల ధరల పెరుగుదల మూడు నుంచి ఐదు శాతం వరకు ఉంటుందన్న అంచనా వేస్తున్నారు. కొవిడ్ వైరస్ ప్రభావం తగ్గకుంటే రానున్న రోజుల్లో ధరల మంట మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టీవీల ధరలు రానున్న కొద్ది రోజుల్లో ఏడు నుంచి పదిశాతం పెరిగే వీలుంది. కొవిడ్ కారణంగా చైనాలోని పరిశ్రమలు మూతపడటం.. వాటి తయారీ నిలిచిపోవటంతో విడిభాగాల కొరత మార్కెట్ ఎదుర్కొంటోంది.

రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుంది. ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు భారీగా పెరిగేందుకు కారణమవుతుందని భావిస్తున్నారు. కొవిడ్ కారణంగా విడిభాగాల కొరత.. ధరలు పెరగటం లాంటి భారాలు మీద పడటంతో కంపెనీలు కిందామీదా పడుతున్నాయి. తమ మీద పడిన భారాన్ని వినియోగదారుల మీద మళ్లించే ముందు.. వస్తు ప్రమోషన్ల కోసం కేటాయించిన బడ్జెట్ల ను వినియోగిస్తున్నారు.

అంటే.. రానున్న రోజుల్లో ప్రకటనల జోరు తగ్గే వీలుంది. మనం చైనా మీద ఎంత ఆధార పడ్డామన్న విషయాన్ని చూస్తే..స్మార్ట్ ఫోన్ల విడిభాగాలు 85 శాతం వరకూ చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంటే.. టీవీ.. ఏసీ.. ఫ్రిజ్ ల విడిభాగాల్ని కూడా 75 శాతం వరకు చైనా మీదే ఆధారపడుతున్న పరిస్థితి.


Tags:    

Similar News