రేవంత్ రాక తప్పదు .. అరవింద్ అల్టిమేటం

బీజేపీ నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Update: 2024-04-29 05:31 GMT

"రేవంత్‌రెడ్డి త్వరలో మా పార్టీలో చేరడం ఖాయం. ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్‌ రేపోమాపో బీజేపీలో చేరతాడు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్‌ పార్టీ నుండి డమ్మీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టాడు" అని బీజేపీ నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దేశం మొత్తం మీద కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతున్నదని, రాష్ట్రంలో కూడా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఖాళీ చేసి బీజేపీలోకి వస్తారని, పరోక్షంగా రేవంత్‌రెడ్డి బీజేపీకే మద్దతు పలుకుతున్నారని అరవింద్ చెప్పడం చర్చానీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో అనేకమార్లు అరవింద్ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. అయితే బీఅర్ఎస్, బీజేపీల మీద నిప్పులు కక్కుతున్న రేవంత్ రెడ్డి అరవింద్ ను మాత్రం మిత్రమా అని మిన్నకుండిపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది.

అదే సమయంలో అరవింద్ 'తెలంగాణలో బీజేపీని నియంత్రించడం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తోనే సాధ్యమైందని, బీజేపీ బలం పెరగకుండా కేసీఆర్‌ మాత్రమే కంట్రోల్‌ చేశారని, కాంగ్రెస్‌ వాళ్లు ఎక్కడా బీజేపీని అడ్డుకోలేకపోయారని' అరవింద్ చెప్పడం గమనార్హం. కేసీఆర్ కుటుంబాన్ని ఘాటుగా విమర్శించే అరవింద్ ఈ మధ్య ట్రాక్ మార్చడమూ చర్చకు దారితీసింది.

45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఎన్నారైల గురించి మాట్లాడని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఇప్పుడు ఎన్నారైల మీద ప్రేమ కురిపిస్తున్నాడని అరవింద్ విమర్శించాడు. పదే పదే రేవంత్ బీజేపీలోకి వస్తున్నాడని అరవింద్ చేస్తున్న వ్యాఖ్యలు వ్యూహాత్మకమా ? అల్టిమేటమా ? అన్నది చర్చానీయాంశంగా మారింది.

Tags:    

Similar News