2 కార్డులతో విత్ డ్రా చేస్తే అంత శిక్షా?

Update: 2016-12-01 11:23 GMT
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. గడిచిన 23 రోజులుగా దేశ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతోన్నకరెన్సీ నోట్ల కొరతతో పడుతున్న ఇబ్బందులు భారీగా ఉంటున్నాయి. బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా.. చేతిలో డబ్బులు లేక చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మెట్రో నగరాల్లో ఉన్న వారి పరిస్థితి కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి. కార్డులతో బతికేసేందుకు నగరాల్లో ఎంతోకొంత అవకాశం ఉంటుంది.

కానీ.. పట్టణాలు.. గ్రామాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ప్లాస్టిక్ కార్డులతో లావాదేవీలు జరిపేందుకు ఏ మాత్రం అనుకూలంగా ఉండదు. ఈ కారణంగానే కరెన్సీ నోట్ల అవసరం తప్పనిసరి అవుతుంది. అందుకే.. ఏటీఎంల దగ్గర.. బ్యాంకుల దగ్గర గంటల తరబడి క్యూలలో నిలుచుంటారు. ఇలా నిలుచున్న తర్వాత ఏటీఎంలలో డబ్బులు ఉండి.. డ్రా చేసుకునే అవకాశం లభించినప్పుడు.. తన దగ్గరున్న రెండు కార్డులతో కాసిన్ని డబ్బులు విత్ డ్రా చేసుకునే ప్రయత్నం చేయటం కనిపిస్తుంది.

ఈ తరహాలోనే ఆశ పడిన ఒక వ్యక్తికి దారుణమైన అనుభవం ఎదురైంది. కర్నూలు జిల్లాలోని చాగలమర్రికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి అందరి మాదిరే ఏటీఎం దగ్గర గంటల కొద్దీ వెయిట్ చేశాడు. చివరకు అవకాశం లభించింది. దీంతో.. లోపలికి వెళ్లిన అతను.. ఒక కార్డుతో కాకుండా రెండు కార్డులతో డబ్బులు డ్రా చేశాడు.

అంతే.. బయటకు వచ్చిన అతనిపై అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న హెడ్ కానిస్టేబుల్ చెలరేగిపోయాడు.రెండు కార్డులతో ఎందుకు డ్రా చేశావని ప్రశ్నించటం.. ఇరువురి మధ్యన వాదన జరగటం.. అది కాస్త పెద్దది కావటంతో తన అధికారాన్ని ప్రదర్శించిన హెడ్ కానిస్టేబుల్.. సుధాకర్ చెయ్యిని బలంగా పట్టుకొని తిప్పాడు. దీంతో.. సుధాకర్ చెయ్యి విరిగింది. దీంతో.. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది. హెడ్ కానిస్టేబుల్ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో.. అతన్ని వీఆర్ కు పంపిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి చేదు అనుభవాలు పలువురు ఎదుర్కొంటున్న దుస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News