వరుస ఓటములు..కేసీఆర్ ఏం చేయనున్నారు?

Update: 2020-12-07 06:30 GMT
దుబ్బాకలో ఓటమి.. జీహెచ్ఎంసీలో ఎదురుదెబ్బ.. దూసుకొస్తున్న బీజేపీ.. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ లో పునరాలోచన మొదలైందని సమాచారం. రాజకీయ ఎత్తుల్లో ఆరితేరిన కేసీఆర్ ఈ అనూహ్యమైన పరాభావాలపై పోస్టుమార్టం చేస్తున్నట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ఓటమికి బీజేపీ దూకుడు కారణమా? లేక అధికార పార్టీ వైఫల్యాలు కారణమా అన్న ప్రశ్నలు కేసీఆర్ ను తొలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ దీనిపై కింది స్థాయి నుంచి అంతర్మథనం  చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు తెలుస్తోంది.

పార్టీ అధినేతగా కేసీఆర్ , మంత్రులు, ఇతర కీలక నాయకుల మైండ్ సెట్ ను మార్చాలని మొదటగా భావిస్తున్నారు. ఎవరిపైనా నెపం వేయకుండా అందరం తప్పులపై పోస్టుమార్టం చేసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అనుసరించిన విధానాలు.. ప్రభుత్వంపై మొదలైన అసంతృప్తి వంటివి గ్రేటర్ లో ఓడిపోయేలా చేశాయి. టీఆర్ఎస్ వ్యతిరేకతే బీజేపీని గెలిపించింది. ఇక అమిత్ షా, యోగి వంటి వారు వచ్చినా గ్రేటర్ లో మేయర్ పీఠం సాధించలేదు. మెరుగైన సీట్లు మాత్రమే సాధించింది.

ప్రజల్లో అసంతృప్తి ఉందని కేసీఆర్ గ్రహించారు. కానీ నమ్మకం, విశ్వాసం ఇప్పటికీ టీఆర్ఎస్ పై ఉన్నాయని.. దాన్ని నిలబెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.  ముఖ్యంగా ప్రజా సమస్యలపై స్పందించి వారిపై భారం వేయకుండా ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజాదర్భార్ లాంటివి నిర్వహించి ప్రజలకు చేరువ కావాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
Tags:    

Similar News