రేప్ నిరసన ర్యాలీలో లైంగిక‌ వేధింపులు..

Update: 2018-04-19 13:11 GMT
కాంగ్రెస్ నేత‌లు త‌లదించుకోవాల్సిన ఉదంతం. బీజేపీని ఎదురుదాడి చేసే నైతిక‌త కోల్పోయిన సంద‌ర్భం ఇది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా - ఉన్నావ్ అత్యాచార ఘటనలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జ‌రుగుతున్న సంగ‌త తెలిసిందే. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ర్యాలీలో...ఆ పార్టీ మ‌హిళా నేత‌ల‌కే లైంగిక వేధింపులు ఎదుర‌య్యాయి. అది కూడా...సొంత పార్టీకి చెందిన నేత‌ల నుంచే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో కాంగ్రెస్‌ కు త‌మ‌ను విమ‌ర్శించే నైతిక‌త ఏముంద‌ని బీజేపీ ప్ర‌శ్నిస్తోంది.

రెండు అత్యాచార ఘ‌ట‌న‌ల‌ను నిర‌సిస్తూ...మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు ముంబయి నగరంలోని జూహూలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మానవత్వం మరచి మృగంలా ప్రవర్తించారు కొందరు ప్రబుద్ధులు. ఆందోళనకారులంతా అత్యాచారాలపై నిరసన తెలుపుతుండగానే..ఈ ర్యాలీలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు.. సహచర మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధించడం మొదలెట్టారు. అభ్యంతరకరంగా చేతితో తాకుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఈ విచారకర ఘటనపై ఓ కాంగ్రెస్ మహిళా కార్యకర్త పార్టీ ముంబయి సిటీ యూనిట్ చీఫ్ సంజయ్ నిరూపమ్‌ కు ఫిర్యాదు చేసింది. ఆ సందేశంలో ఏముందంటే..`యూత్ కాంగ్రెస్ - ఎన్‌ ఎస్‌ యూఏ(పార్టీ స్టూడెంట్ వింగ్) కార్యకర్తలు పార్టీ మహిళా కార్యకర్తలతో అసభ్యకరంగా వ్యవహరించారు. కావాలని వారి మధ్య దూరి ముందుకు వెనక్కి నెడుతూ - చేతులతో తడుముతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. సొంత పార్టీలో సహచర పురుష కార్యకర్తల మధ్యే మాకు రక్షణ లేకుండా పోయింది` అని ఆమె తన సందేశంలో పేర్కొంది. `భవిష్యత్‌ లో ఇలాంటి నిరసన కార్యక్రమాలు జరిగినప్పుడు మహిళా కార్యకర్తలకు రక్షణ ఉంటుందా? అనే విషయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను` అని కూడా ప్రశ్నించింది.

ఈ విష‌యం మీడియాలో వైర‌ల్ అవ‌డం, బీజేపీ విరుచుకుప‌డిన నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగింది. జిల్లా స్థాయి కార్యకర్త అయిన ఆమె తనకు ఈ ఫిర్యాదును మొబైల్ ఫోన్ ద్వారా ఓ సందేశం పంపించిందని కాంగ్రెస్ పార్టీ ముంబయి సిటీ యూనిట్ చీఫ్ సంజయ్ నిరూపమ్ వివరించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమెకు ఆయన హామీ ఇచ్చారు. త‌మ పార్టీ కార్యక‌ర్త‌ల ప్ర‌వ‌ర్త‌న స‌రికాద‌ని ఆయ‌న అంగీక‌రించారు.

Tags:    

Similar News