మాటల్లో పొత్తులు.. కడుపులో కత్తులు

Update: 2018-11-06 16:35 GMT
కర్ణాటకలో జేడీఎస్‌– కాంగ్రెస్‌ కూటమి ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగించాక తాజాగా పెనవేసుకున్న పొత్తుల కూటముల ఆశలు ఆకాశంలో విహరిస్తున్నట్లుగా ఉన్నాయి.. కర్ణాటకలో జేడీఎస్‌– కాంగ్రెస్‌ కూటమి విజయపు రుచిని అస్వాదించవచ్చు.. కానీ కొద్ది నెలల క్రితం జేడీఎస్‌ అధినేత - కుమార స్వామి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మీరు మాత్రమే ఆనందంగా ఉన్నారని - తాను మాత్రం ఆనందంగా లేనని ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నారు. ఈ మాటలు అప్పట్లో కూటమిలోని అంతర్గత కుంపట్లను బహిర్గతం చేసింది. వెంటనే కాంగ్రెస్‌ పెద్దలు కలుగజేసుకుని తూచ్‌ తూచ్‌ అలాంటిదేమీ లేదని జరగబోయే ఉపద్రవాన్ని అప్పటికి ఆపగలిగారు.. కానీ ఇప్పటికీ కూటమి కుంపటి నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉందనేది కాదనలేని సత్యం. ఉప ఎన్నికల ఫలితాలు అనుకూలమైనప్పటికీ జేడీఎస్‌ కు ఒకింత వణుకు పుట్టిస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.. ఎందుకంటే ఇప్పటికే అతి తక్కువ సీట్లు ఉన్న జేడీఎస్‌ కు ఎక్కువ బలం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మద్దతిచ్చి అధికార పగ్గాలు అప్పగించింది.. ఇప్పుడు కాంగ్రెస్‌ బలం పెరిగి.. అదే సమయంలో బీజేపీ ప్రాబల్యం తగ్గే కొద్దీ అధికార కుర్చీ వైపు కాంగ్రెస్‌ నేతల కన్ను పడుతుందనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో బీజేపీ నుంచి మరి కొంత మంది ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన పొత్తుల ముళ్ల కిరీటం ధరించి రాజ్యమేలుతున్న జేడీఎస్‌పార్టీ.. ఆనందించాలో.. ఆందోళన పడాల్లో అర్థంగాని పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలో..

పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో అధికార పార్టీ కుర్చీలాక్కోవడానికి ఒక్కరి బలం చాలదని కాంగ్రెస్ - తెలుగుదేశం - సీపీఎం - సీపీఐ పార్టీలు ఒక వరలో వచ్చి చేరాయి.. ఈ పొత్తుల కత్తులన్నీ ఒక వరలో ఇమడలేవని తెలిసినప్పటికీ అధికారమే పరమావధిగా సర్దుకుపోతున్నాయి. భావ సారూప్యతలేని ఈ పార్టీల ప్రయాణం బ్యాలెట్‌ తీరం వరకే అనేది తలపండిన రాజకీయ నేతల విశ్లేషణ. సీట్ల లెక్కలు తేలక ముందే సీపీఐ నేత చాడ.. తమకు బలం లేకపోయినా చాంతాండంత లిస్టు ఇచ్చారని - ఇది అసాధ్యమని కూటమిలోని మిగిలిన పార్టీలు మండిపడుతున్నాయి.. ఇంకా ఓటరు మహాశయుని దగ్గర కెళ్లి.. వీరే మీ అభ్యర్థి అని చెప్పకుండానే.. కూటమి కుంపట్లు రగులుతుండడంతో ఇది ఎక్కువ కాలం నిలిసే పొత్తు కాదని అందరూ అభిప్రాయ పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో..

తెలంగాణ రాష్ట్రంలో అంటే టీఆర్‌ ఎస్‌ ఐదేళ్లపాటు అధికారంలో ఉంది కావున.. అధికార బలాన్ని ఎదుర్కోవాలంటే సమూహం కావాలని అందరూ గుంపుగా చేరారు.. కానీ ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీనే.. ప్రతిపక్ష పార్టీకి భయపడి పొత్తులకు వెంపర్లాడడం చూస్తుంటే.. యుద్ధానికి ముందే ఆయుధాలు పక్కన పడేసి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌ పార్టీ శరణు కోరడం.. ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోందని రాజకీయ పండితులు అంటున్నారు. ఇలా ఒక పంజరంలో చేరిన చిలక గోరింక ఎన్ని రోజులు కలిసి కాపురం చేస్తాయో ఇట్టే అర్థమైపోతుందని పేర్కొంటున్నారు.. బ్యాలెట్‌ లెక్క తేలిన వెంటనే వీరి కాపురంలో విడాకుల చుక్క ఎదురవడం ఖాయమని ఘంటాపథంగా చెబుతున్నారు.  ఇప్పటి వరకు మాటల్లో ఉన్న పొత్తులన్నీ చిత్తయిపోయి.. కడుపులో ఉన్న కత్తులు బయటికి వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News