కాంగ్రెస్ ను హడలెత్తిస్తున్న 'తాళం'

Update: 2016-02-05 10:55 GMT
 ఏపీలో కాంగ్రెస్ కు కొత్త చిక్కు వచ్చింది. కర్నూలు కాంగ్రెస్ కార్యాలయానికి కోట్ల సూర్యప్రకాశరెడ్డి తాళం వేసినా కూడా దాన్ని తీసే సాహనం చేసేవారే ఆ పార్టీలో లేకపోయారు. దీంతో కోట్ల ముందు ఏపీ కాంగ్రెస్ అంతా తేలిపోయింది.

ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి 10ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో రాహుల్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కోట్ల కూడా వెళ్లారు. అయితే సభ వేదిక వద్దకు సూర్యప్రకాశ్‌ రెడ్డిని అనుమతించలేదు. దీంతో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారు. అవమాన భారంతో వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. కోట్లకు జరిగిన అవమానంతో రగిలిపోయిన అనుచరులు రెండు రోజుల క్రితం పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. దాన్ని తెరిచేందుకు ఇప్పుడు ఎవరూ సాహసం చేయడం లేదు. కోట్ల కూడా దాన్ని తెరిచే దమ్మెవరకి ఉందో చూస్తానంటున్నారు.

దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వరుస పెట్టి  బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కోట్ల మాత్రం తగ్గడం లేదు. చర్చల కోసం ఇంటికొచ్చిన నేతలకు కడుపునిండ భోజనం పెట్టి పంపుతున్నారే గానీ వెనక్కు తగ్గడం లేదు. ఏఐసీసీ నాయకులే వచ్చి క్షమాపణలు చెప్పాలని తేల్చిచెబుతున్నారు. ఇప్పటికే పల్లంరాజు - బాపిరాజు - శైలజనాథ్ వంటివారు కోట్లను శాంతపరిచేందుకు విఫలయత్నం చేశారు. రఘువీరా రెడ్డి కూడా రంగంలోకి దిగారు.   కోట్లను బుజ్జగించడం ఒక ఎత్తయితే.. తాళం తీయడానికి కాంగ్రెస్ నేతలు జంకుతుండడం ఇంకో విచిత్రం. దాంతో కాంగ్రెస్ పరువు గంగలో కలుస్తోంది. ఏఐసీసీ నేతలు వచ్చి క్షమాపణ చెబితే కానీ కోట్ల తాళం తీసేలా లేరు.
Tags:    

Similar News