ప్ర‌కాశం వైసీపీలో ఆర‌ని మంట‌లు...!

Update: 2021-10-30 03:30 GMT
దర్శి వైసీపీలో అసంతృప్తి జ్వాల‌లు ర‌గులుతూనే ఉన్నాయి. ఏడాదిన్నరగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విష యం తెలిసిందే. అది అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం ఇద్దరికీ హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారు. దీంతో గత రెండు నెలలుగా పరిస్థితి చక్కబడినట్లు కనిపించింది. ముండ్లమూరు ఎంపీపీ ఎన్నిక విషయంలో బూచేపల్లిని బలవంతంగా మద్దిశెట్టి గ్రూపునకు మద్దతిచ్చే విధంగా చేశారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌గా వెంకాయమ్మ ఎన్నిక కార్యక్రమానికి వేణుగోపాల్‌ కూడా హాజరుకావటంతో పరిస్థితులు చక్కబడుతున్నట్లుగా పార్టీశ్రేణులు భావించాయి.

అయితే వెంకాయమ్మ జడ్పీటీసీగా ఏకగ్రీవంగా గెలుపొందినా దర్శి మండలానికి ఇంతవరకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో జడ్పీ చైర్‌పర్సన్ అభినందన సభ రాజ‌కీయ దుమారానికి వేదిక‌గా మారింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేణుగోపాల్‌ కానీ, వైసీపీలో ఆయనతోపాటు కలిసి నడుస్తున్న నాయకులు కానీ హాజరుకాకపోవటం చర్చనీయాంశమైంది. సభకు హాజరైన స్థానిక నాయకులు కానీ, ఇటు వెంకాయమ్మ అటు శివప్రసాదరెడ్డి కానీ ఎక్కడా ఎమ్మెల్యే  పేరుని ప్ర‌స్తావించ‌లేదు. మరోవైపు ఎమ్మెల్యే వేణుగోపాల్‌ ఈ కార్యక్రమ నిర్వహణపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.

అది తెలిసి బూచేపల్లి కూడా ఎమ్మెల్యే విధానాన్ని తప్పుబడుతూ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయటం విశేషం. అయితే.. శివప్రసాదరెడ్డి ఇటు బాలినేని అటు సజ్జలకు ఒక సందేశం పంపిన‌ట్టు తెలిసింది. దర్శిలో ఒకప్పుడు తన తండ్రి  ఎమ్మెల్యే, ఆ తర్వాత తాను ఎమ్మెల్యేన‌ని... ఇప్పుడు త‌న‌ తల్లి వెంకాయమ్మ దర్శి నుంచే ఏకగ్రీవంగా జడ్పీటీసీ అయ్యారని చెప్పుకొచ్చారు. ఆమె జడ్పీ చైర్‌పర్సన్‌ అయి నెలైంది. ఎమ్మెల్యే నుంచి పిలుపు వస్తుంది, సొంత ప్రాంతానికి వెళ్లాలని ఎదురుచూశామ‌ని ఆయ‌న తెలిపారు.

ఈ దశలో నియోజకవర్గంలోని అభిమానుల నుంచి ఒత్తిడి వచ్చింద‌ని, బూచేపల్లి కుటుంబ అభిమానులుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న వివ‌రించార‌ట‌. అయితే.. దీనిపై అటు ఎమ్మెల్యే వ‌ర్గం వెర్ష‌న్‌, ఇటు మాజీ ఎమ్మెల్యే వ‌ర్గం వెర్ష‌న్‌ను ప‌రిశీలిస్తున్న వైసీపీ నాయ‌కులు ఏం చేయాలో తెలియ‌క త‌ల ప‌ట్టుకుంటున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ కులాల వారీగా విడిపోయింది. రెడ్లు అంతా శివ‌ప్ర‌సాద్ రెడ్డి గ్రూప్‌లోకి వెళ్లిపోయారు. ఇక ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి కులానికి చెందిన వారంతా ఆయ‌న గ్రూపులో ఉన్నార‌ట‌. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ద‌ర్శి వైసీపీ వార్ ఇలా కంటిన్యూ అయ్యేలా ఉంది.
Tags:    

Similar News