జోర్డాన్ పార్లమెంటులో ఎంపీల మధ్య తన్నులాట.. వీడియో చూశారా?

Update: 2021-12-30 07:30 GMT
దేశం ఏదైనా కానీ.. దేశ అత్యున్నత స్థాయి చర్చా వేదికగా.. శాసనాల్ని రూపొందించే పార్లమెంటును దేవాలయంగా భావిస్తారు. పార్లమెంటు అన్న తర్వాత వాదనలు.. ప్రతివాదనలు.. విమర్శలు.. నిందలు.. ఆరోపణలతో వాతావరణం వేడెక్కిపోయేలా ఉంటుంది. అంతే తప్పించి.. హద్దులు దాటేసి.. ఒకరికొకరు కొట్టేసుకునే పరిస్థితి ఉండదు. తాజాగా జోర్డాన్ పార్లమెంటులో అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభ్యుల మధ్య మొదలైన వాదనలు విచక్షణ కోల్పోయి ఒకరికొకరు పిడి గుద్దులు గుద్దుకోవటం.. వారిని కంట్రోల్ చేసే క్రమంలో.. తాము చేయి చేసుకోవటం లాంటి షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

రాజ్యాంగ సంస్కరణల గురించి జోర్డాన్ పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అంశాల్ని విపక్షాలు వ్యతిరేకించాయి. జోర్డానియన్ల విధులు.. హక్కులపై రాజ్యాంగ సవరణ కోరుతూ ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టింది. పౌరులందరికీ సమాన హక్కులకు హామీ ఇచ్చే చట్టంలో ప్రత్యేకంగా మహిళల పేరును పెట్టటాన్ని పలువురు వ్యతిరేకంచారు. ఇది లింగ వివక్షకు దారి తీస్తుందని.. ఈ ముసాయిదా సవరణను నిలిపివేయాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా విపక్షానికి చెందిన ఎంపీ ఒకరు సవరణ బిల్లు పనికి రాదంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆ సందర్భంగా అధికార పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో.. సదరు విపక్ష ఎంపీపై అధికారపక్ష ఎంపీలు వాదనకు దిగారు. మాట తూలిన ఎంపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని స్పీకర్ సైతం స్పష్టం చేశారు. అయినప్పటికీ విపక్ష ఎంపీ మాత్రం సారీ చెప్పేందుకు నిరాకరించారు.

ఈ క్రమంలో మాటలు పెరిగి.. దూషణల స్థాయికి చేరటం.. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన ఎంపీలు ఒకరిపై ఒకరు కొట్టుకోవటం జరిగింది. ఈ గొడవను ఆపే క్రమంలో ఇతర ఎంపీలు చేయి చేసుకోవటంతో సభలో గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘర్షణలో ఎవరూ గాయపడలేదని చెబుతున్నారు. హుందాగా చర్చించుకోవాల్సిన ఎంపీలు.. అందుకు భిన్నంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకోవటం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గొడవ మొత్తం లైవ్ టెలికాస్ట్ కావటంతో సంచలనంగా మారింది.




Tags:    

Similar News