విశాఖలో సీఎం ఆఫీస్... ?

Update: 2021-10-10 12:13 GMT
విశాఖను పాలనా రాజధాని అని జగన్ ప్రకటించారు. ఈ ప్రకటన చేసి రెండేళ్ళు అయింది. ఇక మూడు రాజధానుల చట్టం చేసి కూడా ఏడాది పై దాటింది. ఇప్పటికీ ఆ కల సాకారం కాలేదు. మొదట్లో మూడు రాజధానుల మీద జనాలకు ఉన్న మోజు క్రమంగా తగ్గుతోంది. మరో వైపు విశాఖకు ఇదిగో వస్తాం, అదిగో వస్తామని వైసీపీ నేతలు, మంత్రులు ఇచ్చిన ప్రకటనలు కూడా ఇపుశు సీరియస్ నెస్ లేకుండా పోతోంది. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ పెడతారు, అదిగో ముహూర్తం అంటూ తెగ ఊదరగొట్టారు. గత ఏడాది ఉగాది నుంచి మొదలుపెడితే రెండు ఉగాదులు దసరాలు మధ్యన గడచిపోయాయి. ఈ విజయదశమి నాటికి విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీస్ వస్తుంది అన్న మాటలు కూడా ఇపుడు నిజం కావు అన్నది తేలిపోతోంది.

మరో వైపు చూస్తే మూడు రాజధానుల విషయంలో హై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఆ తీర్పు ఎపుడు వస్తుందో ఎవరికీ తెలియదు, దానికి మీద సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాంతో సగం పాలన మాత్రమే చేతిలో ఉన్న వైసీపీ పూర్తి స్థాయిలో విశాఖకు మకాం మారుస్తుంది అని ఎవరూ అనుకోవడం లేదు. కనీసం సీఎం క్యాంప్ ఆఫీస్ అయినా ఇక్కడ నుంచి పని మొదలుపెడితే రాజధాని ఏదో రోజు వస్తుంది అన్న ఆశ అయినా ఉండేది. కానీ ఇపుడు అదీ లేకుండా పోతోంది.

ఇవన్నీ ఇలా ఉంటే విశాఖలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఒక్కోటి తాకట్టు పెట్టేస్తున్నారు. అదే విధంగా మరికొన్ని ప్రైవేట్ పరం అవుతున్నాయి. విశాఖకే కాదు, ఏపీకే తలమానికం అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాబోతోంది. ఇక గంగవరం పోర్ట్ ని వైఎస్సార్ హయాంలో ఏర్పాటు చేశారు. ఆ పోర్టులో ప్రభుత్వ వాటాలను కూడా ఆదానీకి అమ్మేసి ఏకంగా హక్కులు మొత్తం జగన్ సర్కార్ దారాదత్తం చేసింది అని కమ్యూనిస్టులు మండిపడుతున్నారు. ఇక రుణాల కోసం విశాఖ సర్క్యూట్ హౌస్, కలెక్టరేట్ సహా ఇతర ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టేశారు. దీంతో విశాఖలో ఏముందని చెప్పి రాజధాని చేస్తారు అంటున్నారు మేధావులు. విశాఖకు రేపటి రోజున రాజధాని వచ్చినా కూడా పాలించేందుకు ఏముందని కూడా విమర్శిస్తున్నారు.  మొత్తానికి విశాఖ రాజధాని అన్నది ఒక కలగా మారిపోతోంది.  అంతే కాదు  సీఎం ఆఫీస్ కూడా వచ్చే చాన్సే లేదు అన్న మాట కూడా ఉందిపుడు.
Tags:    

Similar News