రాష్ట్ర ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు .. 'వైఎస్సార్‌‌-వేదాద్రి' శ్రీకారం చుట్టిన సీఎం !

Update: 2020-08-28 11:30 GMT
కృష్ణానది పై జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో నిర్మించనున్న ‘వైఎస్సార్‌- వేదాద్రి' ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఆయన శుక్రవారం తన క్యాంప్ ఆఫీస్‌ నుంచి రిమోట్ ద్వారా పైలాన్ ‌ను ఆవిష్కరించారు.

ఈ  సందర్భంగా  ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ‌ మాట్లాడుతూ…విజయవాడ దగ్గరలోనే తాగు, సాగునీటి కష్టాలు ఉన్నాయని తెలిసినా గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఆ సమస్య తీర్చలేకపోయిందని ,   తాము వచ్చిన 14 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ ‌కు శ్రీకారం చుట్టామని  జగన్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపల ఈ ప్రాజెక్ట్ ‌ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం తెలిపారు.   ఈ పథకం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలకు సాగునీరు అందుతుందన్నారు. రూ.491 కోట్ల వ్యయంతో 2.7 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని సీఎం జగన్‌ తెలిపారు.

ఇక , వేదాద్రి గ్రామంలో ఎత్తిపోతల పథకానికి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ  మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని కూడా పాలుపంచుకున్నారు. వారికి స్థానిక ఎమ్మెల్యే, విప్ సామినేని ఉదయభాను స్వాగతం పలికారు.  పులిచింతల ప్రాజెక్టుకి 11 కిలోమీటర్ల దిగువన ఈ ఎత్తిపోతల పథకం ఉంది. అక్కడి 26 కిలోమీటర్ల పైపులైన్‌ నిర్మాణంతో ఎత్తిపోతల ద్వారా పంటలకు సాగునీరు అందుతుంది. జగ్గయ్యపేట మండలంలో 10 గ్రామాలు, పెనుగంచిప్రోలు మండలంలో 10 గ్రామాలు, వత్సవాయి మండలంలో 8 గ్రామాలకు సాగు నీరందేలా ఈ పథకాన్ని రూపొందించింది. ఈ ఎత్తిపోతల పథకంతో జగ్గయ్యపేట నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. జగ్గయ్యపేట మండలంలో 8 గ్రామాలు, వత్సవాయి మండలంలో 10 గ్రామాలు, పెనుగంచిప్రోలు మండలంలో 10 గ్రామాల్లో మొత్తం  38,607 ఎకరాలకు సాగునీరు అందనుంది
Tags:    

Similar News