బ్రేకింగ్ : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు

వెనిజువెలా పై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకొచ్చిన అగ్రరాజ్యానికి ఊహించని షాక్ తగిలింది.;

Update: 2026-01-05 12:41 GMT

వెనిజువెలా పై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకొచ్చిన అగ్రరాజ్యానికి ఊహించని షాక్ తగిలింది. ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపైనే కాల్పులకు దిగడం కలకలం రేపింది. ఈ పరిణామం అమెరికా రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడడం అగ్రరాజ్యంలో తీవ్ర సంచలనంగా మారింది. ఒహియో రాష్ట్రంలో ఉన్న ఆయన నివాసంపై ఈ దాడి కలకలం రేపింది.

స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. ఒక వ్యక్తి జేడీ వాన్స్ ఇంటిని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. ప్రాణనష్టం తప్పిందని భద్రతా సిబ్బంది తెలిపారు.

రంగంలోకి సీక్రెట్ సర్వీస్

కాల్పుల శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు స్థానిక పోలీసులు నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నివాసం చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు గాలింపు చేపట్టి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత దాడినా? వ్యక్తిగత కక్షల వల్ల జరిగిందా? లేదంటే వెనిజువెల మద్దతుదారుల పనా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడి నేపథ్యం గురించి అధికారులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

ఈ ఘటనపై వైట్ హౌస్ అత్యవసరంగా స్పందించింది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రస్తుతం పూర్తి సురక్షితంగా ఉన్నారని.. ఆయన భద్రతకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. ఈ ఘటన నేపథ్యంలో దేశంలోని కీలక రాజకీయ నాయకుల నివాసాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

అమెరికాలో ఇటీవల కాలంలో రాజకీయ నాయకులపై దాడులు, బెదిరింపులు పెరుగుతుండటం పట్ల సామాన్య ప్రజలు.. విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News