ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు బిగ్ రిలీఫ్!
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న పలు అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.;
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న పలు అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఇటీవలే.. సీనియర్ అధికారి, మాజీ ఎస్ ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించారు. ఇదిలావుంటే.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ కీలక నేత.. హరీష్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
ఈ కేసులో ఆయన ప్రమేయం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు.. హరీష్‌రావును విచారించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కోర్టు తోసిపుచ్చింది. వాస్తవానికి గతంలోనే హైకోర్టు.. ఈ విషయంలో హరీష్‌రావు కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ సహా.. ఇతర ఫిర్యాదులను కొట్టివేసింది. కానీ, అధికారులు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హరీష్‌రావు పాత్ర ఉందని పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను తాజాగా సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. హరీష్‌రావు ప్రమేయం ఉన్నట్టుగా ఎలాం టి ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నిరూపించలేకపోయారని పేర్కొంది. పైగా హైకోర్టు ఇప్పటికే ఈ పిటిషన్‌ను కొట్టి వేసిన నేపథ్యంలో దీని లోతుల్లోకి తాము వెళ్లాలని అనుకోవడం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హరీష్‌రావుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో హరీష్‌రావుకు బిగ్ రిలీఫ్ దక్కినట్టు అయింది.
ఇదే సమయంలో ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ హరికిషన్ కు కూడా సుప్రీంకోర్టు ఉరటనిచ్చింది. ఆయనపై నమోదైన కేసులను కూడా కొట్టి వేసింది. ప్రస్తుతం రాజకీయంగా కవిత నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో హరీష్‌రావుకు.. కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి విముక్తి లభించడం గమనార్హం.