జనవరిలో కరోనా వ్యాక్సిన్:సీఎం జగన్

Update: 2020-09-29 17:30 GMT
ఏపీలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కేసుల తీవ్రతపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, ఆసుపత్రులలో కరోనా రోగులకు అందుతున్న చికిత్సల గురించి అధికారులను ఆరా తీశారు జగన్. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని, వచ్చే ఏడాది జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు కరోనాతో ప్రజలు సహజీవనం చేయక తప్పదని, అదే సమయంలో వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని జగన్ అన్నారు. ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య మరింత పెరిగిందని, అదే సమయంలో కేసుల సంఖ్య తగ్గడం శుభపరిణామమని జగన్ తెలిపారు.

ఏపీలో కరోనా మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందని, పాజిటివిటీ రేట్‌ 12.0 నుంచి 8.3కి తగ్గిందని అన్నారు. ఆరోగ్యశ్రీ కింద కరోనాకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, కరోనా టెస్టులలోనూ ఏపీ ముందుందని చెప్పారు. కోవిడ్‌ ఆస్పత్రులలో మెరుగైన వైద్యం అందించాలని, రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని జగన్ అన్నారు. కోవిడ్ ఆసుపత్రుల జాబితా గ్రామ సచివాలయాల్లో ఉండాలని , ఎంప్యానల్‌ ఆస్పత్రుల లిస్టు కూడా అందుబాటులో ఉంచాలని జగన్ ఆదేశించారు. 104 టోల్ ఫ్రీ నంబర్ పనితీరును సంబంధిత అధికారులు, కలెక్టర్లు సమీక్షించాలని, 104కు ఫోన్ చేసిన వెంటనే కరోనా టెస్ట్‌లు, హాస్పిటల్స్ వివరాలు ప్రజలకు అందాలని అన్నారు. 104 సేవలకు సంబంధించి లోటుపాట్లుంటే వెంటనే సరి చేసుకోవాలని.. ప్రతిరోజూ మానిటర్‌ చేయాలని సంబంధిత అధికారులకు జగన్ సూచించారు.
Tags:    

Similar News