కర్నూల్ వైసీపీ లో ఆధిపత్య పోరు ..ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే ఢీ !

Update: 2020-01-27 05:03 GMT
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీలో ఒక్కసారిగా విబేధాలు భగ్గుమన్నాయి. కర్నూలు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు బయట పడింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఇతర పార్టీల కార్యకర్తలను వైసీపీలోకి చేర్చుకున్నారు. దీనితో ప్రస్తుత కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా తానుండగా నియోజక వర్గంలో ఎస్వీకి ఏం పని అని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎస్వీ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.

" నా అనుమతి లేకుండా పార్టీ లో చేరికలు చెల్లవు. సామాన్య కార్యకర్త అంటూనే పార్టీ నాశనం కోరతారా? నువ్వే ఓ కార్యకర్తవు.. ఏ అధికారం తో ఇతర పార్టీల కార్యకర్తలను చేర్చుకుంటావు. నీకు ధైర్యం ఉంటే సొంత నియోజక వర్గం పత్తికొండ కు వెళ్లి కార్యకర్తలను చేర్పించుకోవాలి "అని హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కి లేఖ రాసారు.

ఇకపోతే , ఎస్వీ మోహన్‌ రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన తెలుగు దేశం పార్టీ ఆకర్ష్ లో భాగంగా టీడీపీ లోకి ఫిరాయించారు. దీంతో హఫీజ్ ఖాన్‌ ను పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి 2019లో ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు. అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఎన్నికలకు ముందు ఎస్వీ మోహన్‌ రెడ్డి తిరిగి వైసీపీలో చేరారు. మళ్లీ తిరిగి పార్టీలో చేరే సమయంలో తాను వైసీపీ సామాన్య కార్యకర్తగానే ఉంటానని ఎస్వీ మోహన్‌ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ , ఎస్వీ మోహన్‌రెడ్డికి లేఖ రాయడంతో ఆ లేఖకి ప్రాధాన్యం సంతరించుకుంది.
Tags:    

Similar News