చింతమేనేని అరెస్ట్.. పోలీసులపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Update: 2021-02-18 15:46 GMT
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పెదవేగి మండలం బి.సింగవరం గ్రామంలో బుధవారం రాత్రి చింతమనేని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఘర్షణ సమయంలో తాను లేనని.. తాను వెళ్లిపోయాక ఈ గొడవ జరిగిందని చింతమనేని ఎంత మొత్తుకున్నా పోలీసులు వినకుండా ఆయనను అరెస్ట్ చేసేశారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నేతల ఫిర్యాదుతో ఘటనా స్థలంలో లేనప్పటికీ తనను అరెస్ట్ చేశారని చింతమనేని సైతం పోలీసులకు చెప్పారు.

కాగా ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు వైసీపీ యూనిఫాం ధరించి ఆ పార్టీ నేతలు చెప్పినట్టు నడుచుకుంటున్నారని.. అలాంటి పోలీసులు అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. చింతమేనని అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఆయనను వెంటనే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.పంచాయతీ ఎన్నికల్లో వెంటాడుతున్న ఓటమి భయంతోనే టీడీపీ నాయకులపై అక్రమ కేసులు మోపి లోపల వేస్తున్నారని లోకేష్ విమర్శించారు.
Tags:    

Similar News