చింతమనేనికి ఏమైంది ? ఎక్కడా కనబడటం లేదు.. వినబడటం లేదే?

Update: 2020-10-25 03:30 GMT
చింతమనేని ప్రభాకర్...ఈ పేరుకి కొత్తగా పరిచయటం అవసరమే లేదు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు బాగా వివాదాస్పదమైన ఎంఎల్ఏల్లో ఈయన కూడా ఒకరు. అందుకనే చింతమనేని అనగానే అందరికీ దెందులూరు ఎంఎల్ఏ ప్రభాకరే గుర్తుకొచ్చేవారు.  అలాంటిది  ఇపుడు మాజీ ఎంఎల్ఏపైన పార్టీతో పాటు నియోజకవర్గంలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యర్ధులపై, అధికారులపై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ గొంతు ఇపుడు ఎక్కడా వినబడటమే లేదు.

దెందులూరు ఎంపీపీగా రాజకీయాలు మొదలుపెట్టిన చింతమనేని చాలా స్పీడుగా ఎదిగారు. 2009లో మొదటిసారి ఎంఎల్ఏగా పోటి చేసిన చింతమనేని గెలిచారు. అలాగే రెండోసారి 2014లో కూడా గెలిచారు. అయితే రెండోసారి గెలవటంతో పాటు పార్టీ కూడా అధికారంలోకి రావటంతో ఎంఎల్ఏ ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన వెంటనే ఎంపీపీ అవ్వగానే ఇసుక క్వారీలపై చింతమనేని కన్నుపడింది.  2009లో  ఎంఎల్ఏ అవ్వగానే ఇసుక వ్యాపారాన్ని పెంచుకున్నారు.

ఇక రెండోసారి ఎంఎల్ఏ అవ్వగానే వ్యాపారంలో అక్రమాలకు కూడా మొదలుపెట్టారనే ఆరోపణలు బాగా వినపడ్డాయి. జిల్లాల హద్దులు కూడా దాటేసి అవకాశం ఉన్న ప్రతిచోట తవ్వకాలు జరిపేస్తున్నాడనే ఆరోపణలు పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలోనే అప్పటి ఎంఆర్వో వనజాక్షితో గొడవలు జరిగాయి. తన అక్రమ తవ్వకాలను అడ్డుకుందన్న కోపంతోనే వనజాక్షిని అందరి ముందు కొట్టడంతో చింతమనేని పేరు రాష్ట్రమంతా మారుమోగిపోయింది. ఇక అప్పటి నుండి పోలీసులను కొట్టడం, ఫారెస్టు అధికారులపై దాడులు చేసిన ఘటనలతో వివాదాస్పద ఎంఎల్ఏగా మారిపోయారు. ఇదే సమయంలో ఎస్సీలను కొట్టడం, అడ్డువచ్చారన్న కారణంతో సొంత పార్టీ నేతలను కూడా కొట్టడంతో చింతమనేనిపై నియోజకవర్గంలోనే బాగా వ్యతిరేకత పెరిగిపోయింది.

అధికారంలో ఉండగా చింతమనేని ఆగడాలను చంద్రబాబునాయుడు కంట్రోలు చేయలేదు. దాని ఫలితంగా ఎంఎల్ఏపై ఎంతమంది ఫిర్యాదులు చేసినా చర్యలే లేకుండాపోయింది.  పైగా 2009లో ఎంఎల్ఏ అయ్యేనాటికే చింతమనేనిపై 30 కేసులున్నాయి. అయితే సీన్ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా. 2019లో సీన్ రివర్సయిపోయింది. వైసీపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోవటం, పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో చింతమనేనికి కష్టాలు మొదలయ్యాయి. పాత కేసులన్నీ ప్రభుత్వం తవ్వి తీసింది. దానికి తగ్గట్లే చింతమనేని బాధితులంతా మళ్ళీ కేసులు పెట్టారు. దాంతో ఇపుడు చింతమనేనిపై సుమారు 60 కేసులున్నాయి. కొన్ని కేసుల్లో ఇఫ్పటికే 65 రోజుల రిమాండ్ కు కూడా వెళ్ళొచ్చారు.

కారణాలు తెలీదు కానీ జైలు నుండి బెయిల్ పై విడుదలైన తర్వాత చింతమనేని ఎవరితోను మాట్లాడకుండా దూరంగా ఉంటున్నారట. పార్టీ నేతలతో కూడా పెద్దగా టక్ లో ఉండటం లేదని టాక్. నేతలతోనే టచ్ లో  లేకపోతే ఇక పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఏమి పాల్గొంటారు ?  అందుకనే చింతమనేని ఎక్కడా కనబడటం లేదు, ఎక్కడా వినబడటం లేదనే విషయంలో చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News