చైనా దుర్మార్గాన్ని కళ్లకు కట్టేలా చెప్పే షాకింగ్ ఫోటో

Update: 2020-09-09 05:30 GMT
చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేని డ్రాగన్ దుర్మార్గం ప్రపంచానికి కళ్లకు కట్టేలా చూపించే ఫోటో ఒకటి బయటకు వచ్చింది. యుద్ధ నీతి అన్నది తమకు ఇసుమంత కూడా లేదన్న సత్యం ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది. తన సరిహద్దు దేశాలతో ఏదోలా పంచాయితీ పెట్టుకునే చైనా తీరు తేటతెల్లం చేసేలా ఈ ఫోటో ఉంది.

ఓవైపు ఇరుగుపొరుగు దేశాల మీద అదే పనిగా ఆరోపణలు చేసే ఆ దేశం.. స్వయంగా ఎలాంటి తీరును ప్రదర్శిస్తుందో చెప్పే ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గల్వాన్ లోయలో భారత సైనికుల మీదకు మేకులతో తయారు చేసిన కర్రలతో దాడికి పాల్పడి.. పలువురు మరణాలకు కారణమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత సైనికులు వీరోచితంగా పోరాడటంతో చైనాకు చెందిన పలువురు సైనికులు మరణించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఇప్పటికే వెల్లడించని చైనా గుట్టుగా దాచి పెడుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా చైనా సైన్యం వేట కొడవళ్లను కర్రలకు జత చేసి.. సరిహద్దుల వద్ద మొహరించిన ఫోటోలు బయటకు వచ్చాయి. తూర్పు లద్దాఖ్ సెక్టార్ లోని వాస్తవాధీన రేఖ వెంట బరిసెలు.. ఇతర పదునైన ఆయుధాలతో నిలిచిన చైనా సైనికుల ఫోటోలు భారత మీడియా బయటపెట్టింది. దీంతో.. చైనా సైనికుల తీరు ఎలా ఉంటుందన్న విషయం ప్రపంచానికి తెలిసేలా చేశాయని చెప్పాలి.
Tags:    

Similar News