సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు.. ఖండించిన భారత్..!!

Update: 2022-01-07 16:30 GMT
సరిహద్దుల్లో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.  సరిహద్దుల్లో కీలక ప్రాంతమైన తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై ఓ బ్రిడ్జ్ ను నిర్మిస్తున్నట్లు గతంలో శాటిలైట్ ఫోటోలు బయటకు వచ్చాయి. సైనిక చర్యలకు ఆ ప్రాంతం ఎంతో కీలకమైనది. ప్రస్తుతం చైనా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం ఉండే ప్రాంతం 60 ఏళ్లకు పైగా ఆ దేశ పరిధిలోనే ఉంది. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు ఉండే ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ కోసం పునరుద్ధరణ చర్యలు చేపట్టడం పై భారతదేశం తీవ్రంగా స్పందించింది.  అంతేకాకుండా చైనా ఇటువంటి చర్యలకు దిగడం పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.  సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించేందుకు ఇరు దేశాలు ముందుకు రావాలని భావిస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలు చేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.  ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా పాంగాంగ్ సరసు పై బ్రిడ్జి నిర్మాణం కచ్చితంగా జరుగుతున్నట్లు కనిపించింది. బ్రిడ్జి నిర్మాణం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచడానికి చేపట్టిన చర్యగా భారత్ అభివర్ణించింది.  సుమారు 60 ఏళ్లకు పైగా ఆ ప్రాంతం చైనా ఆక్రమణలో ఉందని తెలిపిన భారత్...  సైనిక చర్యలకు అది ఎంతో కీలకమని పేర్కొంది.

ప్రస్తుతం సరస్సు పై చైనా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అది డ్రాగన్ దేశానికి ఎంతో దన్నుగా నిలుస్తుంది. యుద్ధ సమయాలలో సైనిక బలగాలను సులభంగా తరలించేందుకు నిర్మాణం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కీలక సమయాల్లో ఆయుధ సామాగ్రిని అత్యంత వేగవంతంగా తరలించేందుకు కూడా ఈ బ్రిడ్జి చైనా సైన్యానికి మరింత ప్లస్ కానుంది.  ఇప్పటివరకు చైనా ఇలాంటి నిర్మాణాలను సరిహద్దుల్లో చేసుకుంటూ వచ్చింది.  గతంలో కూడా ఇలాంటి నిర్మాణాలను చేపట్టింది. అయితే ఇరు దేశాల అధికారులు కూర్చుని చర్చలు జరిపారు. దీంతో వెనక్కి తగ్గింది చైనా. తిరిగి ఈ సరస్సుపై బ్రిడ్జ్ నిర్మాణం మరింత ఉద్రిక్తత పరిస్థితులు పెంచేలా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పై చైనా కూడా స్పందించింది.  కేవలం ఇది సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగమే అని తెలిపింది.

సరిహద్దుల్లో చైనా వంతెన నిర్మాణాన్ని చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని విదేశాంగ శాఖ అధికారి అరిందమ్‌ బాగ్చి తెలిపారు.  అయితే డ్రాగన్ కదలికలను భారత్ ఎంతో నిశితంగా పరిశీలిస్తోందని  అన్నారు.  ఇప్పుడు నిర్మాణం చేపడుతున్న ప్రాంతం కూడా 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉందని పేర్కొన్నారు.  సైనిక మౌలికవసతుల పేరుతో చైనా నిర్మిస్తున్న ఈ అక్రమ నిర్మాణాలను భారత్ మాత్రం సహించబోదని స్పష్టం చేశారు.  దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా చైనాతో తిరిగి చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. నిర్మాణాలను ఆపేందుకు  సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఇప్పటికే పలు నిర్మాణాలు చేపట్టింది.  అయితే ప్రస్తుతం వాటికి ఆ దేశాల పేర్లు పెట్టడంపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని ఓ మూర్ఖత్వము తెలియగా అభివర్ణించింది.
Tags:    

Similar News