కరోనా సోకిన పిల్లల్లో కొత్త సమస్యలు .. ఆ లక్షణాలు ఏంటంటే

Update: 2021-08-11 08:30 GMT
ప్రపంచంలోని ప్రతి దేశంలో కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంత కాదు, కరోనా మహమ్మారి బారిన పడిన పెద్దవారు దీర్ఘకాలంగా దాని వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌ తో బాధపడుతూ ఉంటారు. కొన్ని నెలల వరకు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, అలసటతో పాటు మరికొన్ని లక్షణాలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, పిల్లల్లో ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ అని వైద్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చాలా అధ్యయనాలు నిరూపించాయి.

తాజాగా ఓ కొత్త పరిశోధన కూడా ఇది నిజమని నిరూపిస్తోంది. అయితే, కరోనా పిల్లలను పెద్దగా ఇబ్బందేమీ పెట్టటం లేదు. కానీ కొందరిలో గుండె, రక్తనాళాలు, కళ్లు, చర్మం వంటి అవయవాలను ప్రభావితం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే మల్టీసిస్టమ్‌ ఇన్‌ ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ (మిస్సీ) అంటారని వైద్యు చెబుతున్నారు. అయితే, కోవిడ్‌-19 అనర్థాలు దీంతోనే ఆగటం లేదు. ఇది పిల్లల్లో కాలేయవాపు (హెపటైటిస్‌) సైతం తెచ్చిపెడుతున్నట్టు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ అధ్యయనం చెప్తుంది.

రెండోసారి కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఉన్నట్టుండి కాలేయవాపు లక్షణాలు బయటపడిన పిల్లలను పరిశీలించగా ఈ విషయం బయటపడిందని వెల్లడించింది. మూడు నుంచి ఆరు వారాల క్రితం కరోనా వైరస్ బారినపడ్డ కొందరు పిల్లల్లో కుటుంబంలో ఎవరికీ కాలేయ జబ్బులు లేకపోయినా హెపటైటిస్‌ లక్షణాలు కనిపించాయని తమ నివేదికలో వివరించారు. వీరిలో చాలామందిలో కోవిడ్‌ లక్షణాలేవీ లేకపోవటం గమనార్హం. కొందరు పిల్లలో మిస్సీ తరహా లక్షణాలు వెలుగుచూశాయి. ఇదిలావుంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెల్టా వంటి కొత్త కరోనా వైరస్‌ రకాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో పిల్లల్లో కాలేయవాపు లక్షణాలపై ఓ కన్నేసి ఉంచటం మంచిదని పరిశోధకులు వెల్లడించారు.

మరో అధ్యయనంలో కరోనా వచ్చిన తర్వాత పిల్లల్లో దాదాపు ఆరు రోజులలోపే పూర్తిగా రికవరీ కనిపిస్తుంది. నాలుగు వారాల తర్వాత కూడా లక్షణాలు కనిపించే పిల్లలు చాలా అరుదు. బాధితుల్లో వీరు కేవలం 4.4 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ విషయాన్నే యూకేకి చెందిన ఓ స్టడీ మరోసారి నిరూపించింది. లండన్‌లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ ఎమ్మా డంకన్ దీనికి లీడ్ ఆథర్‌గా వ్యవహరించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. చిన్న పిల్లల్లో కరోనా లక్షణాలు దీర్ఘకాలం ఉండవు అని నిరూపించేందుకు ఇది మరో అధ్యయనం అని వెల్లడించారు. అయితే, చాలా తక్కువ శాతం మంది పిల్లల్లో మాత్రం ఎక్కువ రోజుల పాటు లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఈ అధ్యయనంలో భాగంగా ఆ పిల్లల గురించి, వారి కుటుంబాల గురించి తాము పూర్తిగా స్టడీ చేశామని ఆమె తెలిపారు.

ఈ అధ్యయనం కోసం జెడ్ ఓఈ కోవిడ్ స్టడీ మొబైల్ యాప్ ద్వారా సేకరించిన డేటాను పరిశోధకులు ఉపయోగించారు. ఇందులో భాగంగా బ్రిటన్‌ కు చెందిన రెండున్నర లక్షల మంది చిన్నారుల డేటాను వీరు పరిశీలించినట్లు తెలిపారు. వీరిలో ఐదేళ్ల నుంచి పదిహేడు సంవత్సరాల వయసు వరకు ఉన్న చిన్నారులు ఉన్నారు. ఈ యాప్ ద్వారా చిన్నారులకు ఉన్న లక్షణాలను వారి తల్లిదండ్రులు లేదా కేర్ టేకర్లు నిపుణులకు అందించారు. అయితే, ఇందులో వారు స్కూల్‌కి వెళ్లారా, లేదా, అన్న విషయాలను మాత్రం పరిగణనంలోకి తీసుకోలేదు. 2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 ఫిబ్రవరి 22 వరకు చిన్నారుల వివరాలను తీసుకుంటే రెండున్నర లక్షల మందిలో కేవలం 1734 మంది కరోనాతో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వారు ఆరోగ్యంగా మారేవరకు వారికి ఉన్న లక్షణాలన్నింటినీ ఈ యాప్‌ లో పొందుపర్చారు. 4

ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే వీరిలో చాలామంది సగటున ఆరు రోజుల పాటు కరోనాతో బాధపడ్డారు. ఈ అధ్యయనం ద్వారా పిల్లల్లో కరోనా లక్షణాలు వచ్చినా వారి రోగ నిరోధక శక్తి వేగంగా ప్రతిస్పందిస్తుందని తేలింది.ప్రస్తుతానికి పిల్లలపై కరోనా ప్రభావం తక్కువగానే ఉందని.. 80 నుంచి 90 శాతం మందిలో అసలు వైరస్ సోకినట్లు కూడా తెలియడం లేదని, కేవలం ఒకటి నుంచి రెండు శాతం మందిలోనే నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. అయితే.. పిల్లలకు కరోనా వచ్చిపోయిన నెల రోజుల తర్వాత ఎంఐఎస్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటోందని.. ఎంఐఎస్ కారణంగా పిల్లల్లో ప్రధాన అవయువాలు దెబ్బతింటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్‌ లో కూడా చాలామంది చిన్నారుల్లో ఎంఐఎస్ లక్షణాలు కనిపించాయని, ఇప్పుడు సెకండ్ వేవ్‌ లో కూడా అదే పరిస్థితి ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే.. ఎంఐఎస్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే 98 శాతం కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెప్పడం కొంత ఊరట కలిగించే విషయం.


Tags:    

Similar News