శంకుస్థాపన ల్యాండ్ ఓనర్ కి చెప్పలేదు

Update: 2015-10-07 15:05 GMT
ఈ రోజు ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన గురించి చాలా పెద్ద చర్చే జరుగుతుంది. ఇక.. మరో పదిహేను రోజులు గడిస్తే.. దేశ.. విదేశీ అతిధులు.. వీవీఐపీలు.. శంకుస్థాన స్థలానికి బారులు తీరబోతున్నారు. ఆ రోజున.. ఆ ప్రాంతంలో కనివినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేయటమే కాదు.. భవిష్యత్తులో ఆ ప్రాంతానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.

మరి.. దీనంతటికి కారణమైన.. సదరు స్థలం ఓనర్ల పరిస్థితేంటి? రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించినా.. ఏపీ సర్కారు శంకుస్థాపనకు సరిగ్గా సరిపోయిన 30 ఎకరాలు ఇచ్చిన వారి సంగతేంటి? రేపొద్దున శంకుస్థాపన చేస్తున్న భూమి యజమానులు ఇప్పుడేం చేస్తున్నారు. నభుతో నభవిష్యతి అన్నట్లుగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్న ఏపీ సర్కారు.. ఈ భూ యజమానులకు ఎలాంటి మర్యాద ఇచ్చిందన్నది చూస్తే.. విస్మయం చెందాల్సిందే.

ఎందుకంటే.. తుళ్లూరులోని ఉద్దండరాయునిపాలెంలోని శంకుస్థాపన చేస్తున్న భూమిని.. అదే గ్రామానికి చెందిన జూజాల చెన్నకేశవరావు.. చలపతిరావులు తమ 30 ఎకరాల భూమిని అందజేశారు. ప్రభుత్వానికి వారిచ్చిన భూమితోనే.. ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి ఇంత భారీగా హంగులు చేస్తున్నాయి. మరి.. దీనంతటికి కారణమైన ఈ ల్యాండ్ ఓనర్లకు ఈ విశేషానికి సంబంధించిన సమాచారం ఇప్పటివరకూ అందలేదు. అంతేకాదు.. ఇన్విటేషన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.

శంకుస్థాపన కోసం ఏపీలోని ప్రతి గ్రామం నుంచి కిలో మట్టి.. ఒక టీటరు నీటిని తీసుకురావాలంటూ భావోద్వేగపు సెంటు మాటలు చెబుతున్న ఏపీ సర్కారు.. శంకుస్థాపన చేస్తున్న ల్యాండ్ ఓనర్లను ఏ మాత్రం పట్టించుకోకపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. భూమి ఇచ్చిన వారందరికి సారె పెట్టి సత్కరిస్తామని చెబుతున్న సర్కారు మాటలకు భిన్నమైన పరిస్థితి చోటు చేసుకోవటం గమనార్హం. బాబు సర్కారు చెప్పే మాటలకు.. చేతలకు ఇంత తేడా ఉంటుందా..?
Tags:    

Similar News