బాబుతో ఇదే పేచీ.. మళ్లీ అదే తప్పు

Update: 2017-11-17 15:30 GMT
చంద్రబాబు చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారు.  అభివృద్ధిని హైదరాబాదులో కేంద్రీకరించి రాష్ట్రం రెండు ముక్కలవడానికి ఎలా తాను కారణం అయ్యాడో ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు.. కానీ.. ఆ తప్పిదం నుంచి ఆయన పాఠాలు నేర్చుకోలేదు. ఇప్పుడు ఆయన మళ్లీ ఎవరు ఎలాంటి ప్రతిపాదనతో వెళ్లినా.. అమరావతిలో పెట్టండి అంటూ అడుగుతుండడం మరీ ఘోరంగా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమరావతి రాజధాని బిజీ నగరంగా ఉంటుంది గనుక.. విశాఖలో షూటింగులకు అనువైన వాతావరణం - ఇప్పటికే కొన్ని స్టుడియోలు ఉండడం జరుగుతున్నది గనుక.. అక్కడ పరిశ్రమకు అవకాశాలివ్వడం అంటే.. వద్దొద్దు అమరావతికే సినీ పరిశ్రమ కూడా రావాలి.. అంటూ చంద్రబాబు ఏ ఉద్దేశంతో అన్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు.

రాష్ట్రప్రగతిని వికేంద్రీకరించి ఉంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పేదరిక పరిస్థితిలో ఉండేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. వేరుపడిన ఆంధ్రప్రదేశ్ కు తొలిముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం చంద్రబాబునాయుడుకు వచ్చిన తర్వాత కూడా... పాలనలో చతురత కలిగినప్పటికీ గతంలో చేసిన తప్పిదాలు పునరావృతమవుతున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్మించే క్రమంలో తన మార్కు అభివృద్ధి ఉండాలనే తపనతో పాలనా వ్యస్థతోపాటు... రాష్ర్టానికి వచ్చే కొత్త పరిశ్రమలు - సాఫ్ట్ వేర్ సంస్థలు - సినీ పరిశ్రమను కూడా అమరావతి పరిసరాల్లోనే ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు కన్పింస్తోంది. గతంలో చేసిన పొరపాట్లను గుణపాఠంగా తీసుకుని పాలనలో చతురత కనబరచలేకపోతున్నారనే విమర్శలున్నాయి. విశాఖను కేంద్రంగా చేసుకుని సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను పరిశీలించకుండానే చంద్రబాబు మొండిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగని పక్షంలో ఉత్తరాంధ్రప్రాంతానికి చెందినవారు మరో రాష్ర్ట ఉద్యమానికి ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు.

 తాజాగా అమరావతిలో నంది అవార్డుల ప్రకటన సందర్భంగా సినీ ప్రముఖులు చంద్రబాబును కలిసిన నేపథ్యంలో సినీ పరిశ్రమ స్థాపనపై చర్చ జరిగింది. కొందరు విశాఖను కేంద్రంగా చేసుకుని సినీ పరిశ్రమకు ప్రాధాన్యత నివ్వాలనే డిమాండు ప్రభుత్వ పరిశీలనకొచ్చింది. అయితే చంద్రబాబునాయుడులో మాత్రం అమరావతి కేంద్రంగా సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలనే ఏకపక్ష ధోరణి కన్పిస్తోంది. ఆయన వారితో అలాంటి ప్రతిపాదనల గురించే మాట్లాడినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News