మోడీ చెప్తేనే దిక్కులేదు, మళ్లీ బాబు వత్తాసా?

Update: 2016-09-14 17:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నాయకుల వాగ్దానాల మీద పూర్తిగా నమ్మకం పోయింది. ఏది ఎలా ఉన్నా.. పవన్‌ కల్యాణ్‌ చెప్పిన మాటల్లో ఒకటి నిజం. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు జనానికి అర్థమయ్యే భాషలో తియ్యగా.. మేం మీకోసం ఏం చేస్తామో వారు వల్లిస్తారు. తీరా గెలిచిన తర్వాత.. ఆర్థిక సంఘం - ప్రణాళికా సంఘం - నీతి ఆయోగ్‌ అంటూ ప్రజలకు అర్థంకాని భాషలో మాట్లాడతారు. అలాంటి విసుగుతో జనానికి నాయకుల వాగ్దానాలంటేనే అసహ్యం పుట్టిపోయి ఉంది.

ప్రత్యేకించి మన రాష్ట్రం విషయానికి వస్తే.. స్వయంగా మోడీ వచ్చి.. మీకు ఫలానా చేస్తా అని చెప్పినా కూడా ప్రజలు నమ్మే దిక్కులేదు. ఆయన చేయగల మోసం ఎంత ఘనమైనదో అమరావతి శంకుస్థాపన నాడే తేలిపోయిందని జనం అనుకుంటున్నారు. అలాంటి నేపథ్యంలో.. మళ్లీ మోడీ చెప్పిన మాటలకు చంద్రబాబు నాయుడు పూచీ ఇస్తే.. ఇక అసలు జనం నమ్మే అవకాశం ఉంటుందా? అని జనం అనుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు సాయం గురించి హోదా ప్రమాణాన్ని ను తుంగలో తొక్కి ప్యాకేజీ పేరిట కేంద్రం కొత్త డ్రామా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపట్ల రాష్ట్రవ్యాప్తంగా జనంలో నిరసనజ్వాలలు పెల్లుబుకుతోంటే.. చంద్రబాబు మాత్రం ప్రధానికి ఫోను చేసి.. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పినందుకు కృతజ్ఞతలు వెల్లడించారుట. ఆయన ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటాం అని చెప్పారుట! చంద్రబాబునాయుడు ప్రజలను మరీ వెర్రివాళ్లుగా జమకట్టి చెబుతున్నారంటూ జనం నవ్వుకుంటున్నారు. మోదీ ఎన్నడూ నేరుగా ప్రజలకు చెప్పరు.. హామీ ఇవ్వరు.. ప్రజలను అడగడం తప్ప - తాను ప్రజలకు చేసేదేమిటో ఆయన నేరుగా ఎన్నడూ కమిట్‌ కారు.. కానీ ఆయనతో ఫోన్లో మాట్లాడిన వాళ్లు మాత్రం.. ఆయన హామీలు ఇచ్చారంటూ తమకు తోచినదెల్లా.. తమ ఘనత కోసం ప్రచారం చేసుకుంటూ ఉంటారని జనం సెటైర్లు వేసుకుంటున్నారు.
Tags:    

Similar News