పవన్ శ్వేతపత్రం అనగానే బాబుకు చిర్రెత్తింది!

Update: 2018-02-14 06:49 GMT
‘శ్వేతవర్ణం’ అంటేనే బాబుకు మహా చిరాకు. తెలుపు రంగు అంటేనే ఆయనకు అసహ్యం! రాజకీయాల్లో పార్టీలతో నిమిత్తం లేకుండా.. నాయకులు అందరూ దాదాపుగా తెల్లటి బట్టలను ధరించడం అనేది ఒక రివాజుగా ఈ దేశంలో చెలామణీ అవుతుంటుంది. ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలకు తప్ప.. నేతలు చాలా వరకు రంగు దుస్తులు వేసుకోరు. కానీ ఒక్క చంద్రబాబునాయుడు మాత్రం.. తెలుపు రంగును పూర్తిగా విసర్జించి... అచ్చంగా.. కాస్త ముదురు గోధుమరంగును మాత్రం తన బ్రాండ్ గా వాడుతుంటారు. తెలుపురంగు- శ్వేతవర్ణాన్నే అంతగా అసహ్యించుకునే చంద్రబాబు ‘‘శ్వేతపత్రం’’ మాట వినిపిస్తే మరెంతగా మండిపడతారో కదా...? అదే మండిపాటు ఇప్పుడు ఆయనతో అప్రకటిత అనుబంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్ కు స్వానుభవంలోకి వస్తోంది.

శ్వేతపత్రం అంటే అందులో పేర్కొన్న ప్రతి వివరానికీ బాధ్యత తీసుకుంటే రాబడి ఖర్చుల గురించి ప్రభుత్వం వివరించే వాస్తవాల డాక్యుమెంట్. తాను గద్దె ఎక్కగానే.. అదివరకటి ప్రభుత్వాలు.. శాఖలను, నిధులను ఏ రకంగా భ్రష్టు పట్టించేశాయో.. ప్రపంచం ముందు చాటి చెప్పి, తన మీద సానుభూతి సంపాదించుకోవడానికి చంద్రబాబునానాయుడు ఈ శ్వేతపత్రం అనే అస్త్రాన్ని వాడుకున్నారు. తన పరిపాలన సమస్తం.. రియల్ టైం గవర్నెన్స్ లాంటి టెక్నికల్ హంగులతో అత్యంత పారదర్శకంగా సాగుతుందనే ఆయన.. తన పాలనలో వ్యవహారాల మీద - ఎవ్వరూ అడగకముందే తనే  శ్వేతపత్రం విడుదల చేసుకుని ఉంటే ఎంత గౌరవంగా ఉండేది. తన పాలన మీద ఎవరు శ్వేతపత్రం అనే మాటెత్తినా.. ఆయన ఒక్కసారిగా ఉడుక్కుంటారు. ఆగ్రహిస్తారు. రంకెలు వేస్తారు.
Read more!

ఇలాంటి రంకెలు పవన్ కల్యాణ్ కు ఎదురు కాలేదు గానీ.. ఆయన  కేంద్రంనుంచి వచ్చిన నిధుల లెక్కలు అడిగేసరికి చంద్రబాబు తన నిజస్వరూపం చూపిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల్లో ఎవ్వరికైనా అడిగే హక్కుంటుంది. అయితే.. వచ్చిన నిధులకు ఖర్చులు వెబ్ సైట్లలోనే ఉన్నాయి చూసుకోవచ్చు.. అని తేలుస్తున్న ముఖ్యమంత్రి శ్వేతపత్రం అనే పదం మాత్రం అనవసరం అని కొట్టిపారేస్తున్నారు. అయినా నిలదీయాల్సింది - నిధులు అడగాల్సింది కేంద్రాన్నే తప్ప - రాష్ట్రం జోలికి రావద్దు అన్నట్లుగా తన పార్టీ నాయకుల సమావేశంలో పవన్ ను ఉద్దేశించి చంద్రబాబునాయుడు హింట్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.

తానే గెలిపించానని, అధికార పీఠంపై తానే కూర్చోబెట్టానని భ్రమల్లో గడిపేస్తున్న పవన్ కల్యాణ్ కు ఇప్పటికైనా చంద్రబాబు నిజస్వరూపం అర్థమవుతుందో లేదో అని ప్రజలు అనుకుంటున్నారు.
Tags:    

Similar News