బాబు డిఫెన్స్ లో పడ్డారా?

Update: 2016-04-28 10:03 GMT
తనను ఆత్మరక్షణలో పడేస్తూ.. షాకుల మీద షాకులు ఇస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దూకుడుకు పగ్గాలు వేసే పనిలో భాగంగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన సేవ్ ద డెమోక్రసీ కార్యక్రమం ఆశించిన ఫలితాల్న ఇస్తుందా? అంటే కొంతమేర ప్రభావం చూపిస్తుందని చెప్పాల్సిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాటలు చూస్తే.. జగన్ ఢిల్లీ పర్యటన బాబు మీద ఒత్తిడిని పెంచినట్లుగా కనిపించక మానదు.

ఒకరి తర్వాత ఒకరిగా జగన్ పార్టీ ఎమ్మెల్యేల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు మీద విపక్ష నేత తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ముట్టచెబుతూ.. వారిలో కొందరికి మంత్రి పదవుల ఆశ చూపుతూ తమను దెబ్బ తీసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారంటూ చేస్తున్న ప్రచారం బాబు మీద ప్రభావం చూపినట్లుగా చెప్పొచ్చు.

ఎందుకంటే.. జగన్ ఏ విషయాల్ని ప్రస్తావించారో అవే విషయాల మీద చంద్రబాబు వివరణ ఇచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తాను ఎవరిని డబ్బులిచ్చి కొనటం లేదని.. రాష్ట్రభవిష్యత్తు కోసమే ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నట్లుగా చంద్రబాబు చెబుతున్నారు. ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తనకు లేదని.. తనకే బలహీనతలు లేవని బాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేత డబ్బుల మాట రావటం అంటే.. జగన్ ఒత్తిడి ఆయనపై పని చేస్తుందని చెప్పక తప్పదు. జగన్ చేస్తున్న ఆరోపణల్ని బలంగా తిప్పి కొట్టేలా కాకుండా బాబు మాటలు వివరణ ఇచ్చుకున్నట్లుగా ఉంటున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై.. బాబు అండ్ కో దృష్టి సారిస్తే మంచిది.

Tags:    

Similar News