జరిగే పనేనా?;మోడీ నోట ఏపీకి శుభవార్త మాట?

Update: 2016-02-10 05:27 GMT
దాదాపు మూడు రోజుల పాటు కాస్త అటూ ఇటూగా ప్రధాని మోడీతో విశాఖపట్నంలో గడిపిన ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి ఆయనకు వీడ్కోలు పలకటం తెలిసిందే. అలా ఆయన వెళ్లారో లేదో.. రెండు రోజే ఢిల్లీకి పయనమయ్యారు ఏపీ ముఖ్యమంత్రి. మంగళవారం ప్రధానిని కలిసిన ఆయన విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని ఆయన్ను కోరటం.. దానిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా బాబు చెప్పుకొచ్చారు.

ప్రధాని మోడీ దగ్గర ఏపీకి ఏమైనా చేయండన్న మాట తప్పించి.. విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేకహోదా మాటను మాట వరసకు కూడా చెప్పలేని చంద్రబాబు ఈసారి చెప్పినట్లుగా వెల్లడించారు. మోడీతో భేటీ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేకహోదా హామీని అమలు చేయాలని తాను ప్రధానిని కోరినట్లుగా పేర్కొనటం గమనార్హం.

గడిచిన రెండేళ్లలో పలుమార్లు మోడీని కలిసినప్పటికీ.. ఎప్పుడూ ప్రత్యేక హోదా మాట బాబు నోటి నుంచి వచ్చింది లేదు. అందుకు భిన్నంగా తాజా పర్యటనలో బాబే.. ఆ విషయాన్నిప్రస్తావించటం.. ప్రత్యేకహోదా.. ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి నీతి అయోగ్ నుంచి నివేదిక అందిందని.. దాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై ఆర్థికశాఖ కసరత్తుచేస్తుందని.. తప్పకుండానే త్వరలో స్వీట్ న్యూస్ వింటారని మోడీ పేర్కొన్నట్లుగా బాబు వెల్లడించారు.  

గత రెండేళ్లుగా ప్రత్యేకాన్ని ప్రస్తావించని బాబు మోడీ దగ్గర ఎలా చెప్పగలిగారు? మోడీ సైతం త్వరలో శుభవార్త వింటారన్న మాటను ఉపయోగించటం లాంటివి చూస్తే..మారిన రాజకీయ పరిస్థితులు.. గత కొద్ది నెలలుగా తరచూ ఎదురవుతున్న ఎదురుదెబ్బల నేపథ్యంలో ఏపీకి ఎంతోకొంత సాయం చేయకపోతే.. మొదటికే మోసం రావటంతో పాటు.. ఇబ్బందులకు గురి అవుతామన్న ఉద్దేశమే మోడీ నోట స్వీట్ న్యూస్ మాట వచ్చేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఆ శుభవార్త ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News