బాబు ఉత్తరాంధ్ర టూర్...పక్కా వ్యూహాత్మకమేనట!

Update: 2020-02-28 00:30 GMT
టీడీపీ అధినేత - విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరడం... ఏదో అలా జరిగిపోయింది కాదట. ఈ పర్యటన వెనుక పెద్ద ప్లానింగే ఉందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. చంద్రబాబు పర్యటన సజావుగా సాగితే... ఉత్తరాంధ్ర ప్రజల్లో టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత కాస్తా... వైసీపీపైకి మళ్లుతుందని - అది టీడీపీకి ఎంతో లాభిస్తుందన్న అంచనా వేసుకున్న తర్వాతే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు ముహూర్తం పెట్టుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా వ్యరేతికిస్తూ చంద్రబాబు తలపెట్టిన ప్రజా చైతన్యయాత్రలో భాగంగానే ఆయన ఇప్పుడు ఉత్తరాంధ్ర టూర్ కు వచ్చారన్న వాదనలు అస్సలు నిజమే కాదట. వైసీపీని ఇరుకున పెట్టే వ్యూహంతోనే చంద్రబాబు సర్వం సిద్ధం చేసుకుని విశాఖ ఫ్లైట్ ఎక్కారట.

ఉత్తరాంధ్ర టూర్ కు చంద్రబాబు రచించుకున్న వ్యూహాత్మక ప్లాన్ ఏమిటన్న విషయానికి వస్తే... వైసీపీ తలపెట్టిన మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించిన చంద్రబాబు... ఒకే రాష్ట్ర- ఒకే రాజధాని అన్న నినాదాన్ని ఎత్తుకున్నారు. అంతేకాకుండా రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా అమరావతికి భూములు ఇచ్చిన రాజధాని రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి చంద్రబాబు వెన్నుదన్నుగా నిలిచారు. అయితే ఈ తరహా వైఖరి కారణంగా విశాఖలో ఏర్పాటు కానున్న ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను వ్యతిరేకించడం ద్వారా చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజల ద్రోహిగా ముద్ర వేసుకున్నారన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ విషయాన్ని ఓ కంట కనిపెడుతూనే... మరో కంట విశాఖలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూదందాకు పాల్పుడుతున్నారని ఆరోపిస్తున్న చంద్రబాబు.. ఆ ఆరోపణలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారట.

ఇంకేముంది... విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడుతున్నట్లు ప్రకటించిన జగన్... విశాఖలో భూదందాలను ప్రోత్సహిస్తున్నారన్న వైనంపై ఆధారాలు దొరికిన వెంటనే జగన్ ను ఉత్తరాంధ్ర ప్రజల ఎదుట దోషిగా నిలబెట్టేందుకు చంద్రబాబు రెడీ అయిపోయారట. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ ఆధారాలన్నీ ప్రజల ముందు పెట్టేసి జగన్ కు దెబ్బేసేందుకు ప్లాన్ వేశారట. ఆధారాలు లభించే దాకా సైలెంట్ గా ఉన్న చంద్రబాబు... ఆధారాలు చేతికి అందగానే విశాఖ ఫ్లైట్ ఎక్కారట. ఈ నేేపథ్యంలో ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన సాఫీగా సాగితే... జగన్, ఆయన అనుచర గణం భూదందాలు సాగిస్తున్నారన్న వైనాన్ని చంద్రబాబు ప్రజలకు చెబుతూ సాగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. అయితే ఉత్తరాంధ్ర దోషిగా మారిన చంద్రబాబును ఉత్తరాంధ్రతో తిరగనిచ్చేది లేదని ఓ వైపు వైసీపీ శ్రేణులు, మరోవైపై ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమయ్యారు. వెరసి చంద్రబాబు ప్లాన్ తిరగబడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News