కాపుల బాధ్యత నాది - చంద్రబాబు

Update: 2016-02-08 11:05 GMT
 కాపులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కులాలు అన్నవి మనం గీసుకున్న గీత మాత్రమేనని... రాజకీయాల కోసం కుల - మత ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం తగదని చంద్రబాబు అన్నారు. కాపులలో పేదవారందరికీ న్యాయం చేయడానికి ఏం చేయాలో అది చేసి తీరుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే... అదేసమయంలో రాష్ట్రంలో అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడిన ఆయన... తుని హింసాకాండకు సంబంధించి బాధ్యలపై చర్యలు తీసుకుంటామని... అయితే, అమాయకులను వేధించడం తమ ఉద్దేశం కాదని... ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. హింసాకాండలో పాల్గొన్న వారిపై మాత్రం చర్యలు తప్పవన్నారు.

రత్నాచల్ ఎక్సప్రెస్ రైలు దగ్ధం చేసిన ఘటన వాస్తవం, పోలీసు స్టేషన్ పై దాడి వాస్తవం వాటికి సంబంధించి హింసాకాండలో పాల్గొన్న వారిపై చర్యలు తప్పవని ఆయన అన్నారు.

అనంతరం ఆయన విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూపై మాట్లాడారు. భారత నావికా దళ కేంద్రంగా విశాఖపట్నాన్ని దేశ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్వయంగా ప్రకటించారని.. విశాఖ ప్రాముఖ్యత ఏమిటన్నది రక్షణ మంత్రి ప్రకటనతోనే తేటతెల్లమైందని అన్నారు.  హుద్ హుద్ తుపానుకు అతలాకుతలమైన విశాఖ నగరాన్ని స్వల్ప వ్యవధిలో పచ్చదనంతో నిండిన నగరంగా మార్చామని, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించి ప్రశంసించారనీ చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రంలో పోర్టులను అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. విశాఖపట్నం - కాకినాడ - కృష్ణపట్నం - అంతర్వేది...ఇలా అభివృద్ధికి అవకాశం ఉన్న పోర్టులు ఎన్నో ఉన్నాయన్నారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 50 దేశాల ప్రతినిధులు కవాతు నిర్వహించడంతో విశాఖ ఖ్యాతి ప్రపంచమంతా తెలిసిందన్నారు.
Tags:    

Similar News