కేసీఆర్ బాటలో అడుగులేస్తున్న చంద్రబాబు

Update: 2016-05-28 11:33 GMT
పేరులోనే కాదు.. ఆలోచనల్లోనూ ఇద్దరి చంద్రుళ్ల ఆలోచనలు కాస్త అటూఇటూగా ఒకేలా ఉండటం గమనార్హం. భారీతనాన్ని విపరీతంగా ఇష్టపడే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ హయాంలో ఐకాన్ భవనాల్ని నిర్మించాలని తలపోస్తున్నారు. భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా తాము అధికారంలో భారీ ప్రాజెక్టులకు తెర తీసి.. వాటితో రాష్ట్ర ప్రజల మనసుల్ని దోచుకోవాలన్న ఆలోచనలో ఇద్దరు చంద్రుళ్లు ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఈ మధ్యనే హుస్సేన్ సాగర్ ఒడ్డున రెండు భారీ విగ్రహాల ఏర్పాటు గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కేసీఆర్ కు పోటీగా అన్నట్లుగా చంద్రబాబు సైతం అమరావతిలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంబేడ్కర్ 125 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలో అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న బాబు.. తాజాగా మరో భారీ విగ్రహాన్ని తాజాగా ప్రకటించారు.పార్టీ వ్యవస్థాపకులు.. ప్రాంతాలకు అతీతంగా తెలుగువారి గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని అమరావతిలో నిర్మించనున్నట్లుగా వెల్లడించారు.

తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ కు అమరావతిలో 115.5 అడుగుల ఎత్తులో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇదే సమయంలో ఎప్పటి మాదిరి భారతరత్న అవార్డును ఎన్టీఆర్ కు ఇవ్వాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని చేశారు. గత కొద్ది మహానాడుల్లో ఎన్టీఆర్ భారతరత్న పురస్కారం మీద ఇలాంటి తీర్మానాలు చేయటం.. అవేమీ కార్యరూపం దాల్చక ఏళ్లకు ఏళ్లు గడిచి పోవటం తెలిసిందే. కనీసం.. ఈసారైనా ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం లభించేలా చేస్తే సదరు పురస్కారం తెలుగు ప్రజలందరికి లభించిన మరో గుర్తింపు అవుతుందనటంలో సందేహం లేదు.

 
Tags:    

Similar News