బీజేపీకి చంద్రబాబు చెక్

Update: 2015-12-08 17:30 GMT
నవ్యాంధ్రలో అధికార టీడీపీ - బీజేపీలు ఒకదానిని మరొకటి బలహీనం చేసుకోవడానికి, ఇతర పార్టీ కంటే పై చేయి సాధించడానికి చాప కింద నీరులా తెర వెనుక కష్టపడుతున్నాయి. ఒక దానికి మరొకటి ఎత్తులు పైయెత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే, 2019 ఎన్నికల తర్వాత నవ్యాంధ్రలో సొంతంగా అధికారంలోకి రావాలని కలలు కంటూ ఆ దిశగా పావులు కదుపుతున్న బీజేపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెక్ చెబుతున్నారు.

అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ ఎక్కడ దొరుకుతుంది.. ఎక్కడ ఆ పార్టీని విమర్శించి బలహీనం చేయాలనే దిశలో బీజేపీ పావులు కదుపుతోంది. ప్రస్తుతానికి ఆ పార్టీ అధ్యక్ష పదవిపై కన్నేసిన సోము వీర్రాజు మాత్రమే బహిరంగంగా బయటకు వచ్చినా.. మిగిలిన నాయకుల లక్ష్యం కూడా ఇదే. దీనికితోడు, పవన్ కల్యాణ్ మధ్య మధ్యలో తురుఫు ముక్కలాగా ఉపయోగించి 2019 నాటికి ఆయనను పూర్తి స్థాయిలో నాయకుడిని చేయాలని కూడా భావిస్తోంది. అందుకే రాజధాని భూ సమీకరణ కావచ్చు.. బాక్సైట్ కావచ్చు.. మధ్య మధ్యలో ఆయనను తురుఫు ముక్కగా ఉపయోగిస్తోంది. దీనికితోడు పవన్ కల్యాన్ కు ఉన్న ప్రధాన బలం ఆయన కులం. కాపు సామాజిక వర్గానికి ఇప్పుడు ఒకనాయకుడు కావాలి. చిరంజీవిని తమ నాయకుడిగా ఆ వర్గం భావించింది. కానీ, ఆయన తన సామాజిక వర్గాన్ని, అభిమానులను కూడా తోసి రాజని కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు నవ్యాంధ్రలో కాంగ్రెస్సే లేదు. దాంతో కాపులకు నాయకుడు కరువయ్యాడు. పవన్ ను తమ నాయకుడని అనుకుంటున్నారు.

అందుకే చంద్రబాబు నాయుడు ఆ సామాజిక వర్గంపై కన్నేశారు. దానిలో చీలిక తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఇవ్వడంతోపాటు తాజాగా రిజర్వేషన్లకు సంబంధించి మంత్రి వర్గంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భూ సేకరణను పూర్తిగా పక్కన పెట్టారు. బాక్సైట్ జీవోను పక్కన పెట్టారు. తద్వారా బీజేపీకి, దాని తురుఫు ముక్క పవన్ కల్యాణ్ కు మాటలు లేకుండా చేశారు.
Tags:    

Similar News