ఏమిటీ లొల్లి.. బాబు పట్టు జారిందా?

Update: 2019-03-14 05:01 GMT
సోమవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను వెదుక్కొంటూ ఉంది! అలాగని తెలుగుదేశం పార్టీ ఏ ప్రతిపక్ష వాసమో చేసి ఉంటే అదో కథ. ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించింది. ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో చెప్పనక్కర్లేదు.

ఇబ్బడిముబ్బడిగా ఇతర పార్టీల నుంచి నేతలను తెచ్చుకున్నారు  చంద్రబాబు నాయుడు. ఒకరా ఇద్దరా.. పాతిక మందిపైగా ఎమ్మెల్యేలను  తెచ్చుకున్నారు. అసలు వారందరినీ బాబు ఎక్కడ పోటీ చేయిస్తాడు అనేదే పెద్ద మిస్టరీగా అనిపించింది. అయితే.. ఆ సంగతి పోనూ.. ఇప్పుడు.. అసలు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి అభ్యర్థులు కరువైన పరిస్థితి నెలకొంది!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణను చేర్చుకుని టికెట్ కేటాయించాలి, వంగవీటి రాధాను తెచ్చుకుని టికెట్ ఇవ్వాలి, పార్టీలోకి  ఇంకా చేరని పనబాకు టికెట్ ఇవ్వాలీ, ఇంతకీ రాజమండ్రి పరిస్థితి ఏమిటి, నెల్లూరులో ఎవరు, ఒంగోలులో ఎలా? ఇవీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు  జరుగుతున్న చర్చలు. నామినేషన్ల దాఖలు మొదలవ్వడానికి ఉన్న టైమ్ మరెంతో కాదు.. జస్ట్ నాలుగు రోజులు మాత్రమే!

ఇలాంటి సమయంలో.. ఇంకా పార్టీలోకి కొంతమందిని చేర్చుకుని వారికి.. టికెట్లు కేటాయించాలి.. అనే అంశాల గురించినే  చర్చ జరుగుతూ ఉంది. ఈ రోజు ఆర్బాటంగా తొలి జాబితా అంటున్నారు కానీ.. ఖరారు అయిపోయిన సీట్ల గురించి కన్నా - అసలు అభ్యర్థులు ఎవరనే అంశం గురించి తర్జనభర్జనలున్న సీట్ల విషయంలోనే  ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది.

బహుశా అభ్యర్థుల  విషయంలో గత ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు ఇంతగా ఇబ్బంది పడలేదేమో! అంతకు ముందు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండినా.. ఎన్నికల సమయానికి అభ్యర్థులు అయితే  చకచకా ఖరారు అయిపోయారు. ఇప్పుడు మాత్రం.. తీవ్రమైన పంచాయితీలే సాగుతూ ఉన్నాయి. పార్టీపై చంద్రబాబు పట్టు తగ్గిందా? లేకపోతే మరీ ఈ దశలో ఇలాంటి పరిస్థితి ఏమిటి? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి విశ్లేషకుల నుంచి!
Tags:    

Similar News