పిల్లాడి ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై బాబు ఫైర్

Update: 2016-10-23 05:27 GMT
కుదురుగా ఒక చోట కూర్చోకుండా.. అనుక్షణం పరుగులు పెడుతూ.. అభివృద్ధిపథంలోకి ఏపీని తీసుకురావాలన్న తపనతో అదే పనిగా శ్రమించే ముఖ్యమంత్రుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపిస్తారు. ప్రతి విషయంలోనూ తన ముద్ర ఉండాలని తపించే ఆయన.. అనునిత్యం పలు కార్యక్రమాల్లో పాల్గొనటమే కాదు.. జిల్లాల మీద జిల్లాల టూర్లు చేయటం బాబులో కనిపిస్తుంది. విభజన పుణ్యమా అని జిల్లాల సంఖ్య బాగా తగ్గిపోవటం.. సీఎం విస్తృతి కుదించుకుపోవటం (ఏపీ సీఎంగా ఉన్న దాంతో పోల్చుకున్నప్పుడు)తో ఆయన మరింతగా జిల్లాల మీద ఫోకస్ చేసే అవకాశం లభించిందని చెప్పాలి. ఈ కారణంతోనే.. గడిచిన రెండున్నరేళ్లలో ఏపీలోని జిల్లాల్లో ఒకటికి నాలుగుసార్లు పర్యటిస్తున్న పరిస్థితి.

తాజాగా ఆయన ‘దోమల దండయాత్ర ర్యాలీ’ని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభను నిర్వహించారు. ఇలాంటి సభల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తుంటారు. కాకినాడ సభలో ఒక విద్యార్థిని మాట్లాడమన్నారు. సదరు విద్యార్థి మైకు అందుకొని.. తమ స్కూల్ ముందు మందుబాబుల ఆగడాలు.. అపరిశుభ్రత లాంటి సమస్యల్ని ఏకరువు పెట్టటంతో బాబుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అప్పటివరకూ తన పాలనలో చాలా అభివృద్ధి జరిగిందని.. అద్భుతమైన పాలన జరుగుతుందన్న మాటల్ని ప్రశ్నించేలా విద్యార్థి మాటలు ఉండటంతో ఆయనకు కోపం ముంచుకొచ్చింది.

విద్యార్థి చెప్పిన సమస్యలపైన సదరు స్కూల్ హెచ్ ఎంకు క్లాస్ పీకిన చంద్రబాబు.. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పిలిచి.. ‘‘ఏవమ్మా నువ్వు సపోర్టు చేస్తున్నావా?’’ అని నిలదీశారు. ఊహించని పరిణామంతో ఎమ్మెల్యే నోట మాట రాని పరిస్థితి. పిల్లాడి చేసిన ఫిర్యాదును బాబు సీరియస్ గా తీసుకోవటమే కాదు.. ఎమ్మెల్యేను.. స్కూల్ హెడ్మాస్టర్ ను నిలదీసి.. మద్యం సేవించే ఘటనల్ని తగ్గించాలని.. ఒకవేళ మద్యం తాగి ఇబ్బంది కలిగించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టాలంటూ చంద్రబాబు పోలీసుల్ని ఆదేశించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News