జ‌గ‌న్‌.. ప‌వ‌న్‌.. త‌మ్ముళ్ల‌కు బాబు వార్నింగ్‌!

Update: 2018-07-26 04:49 GMT
ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఎన్నిక‌ల‌కు ఏడాది ఉన్నా.. అధినేత‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న తీరుతో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వాడి వేడీగా మారింది. ప్ర‌త్యేక హోదా అంశంలో ప‌లుమార్లు యూట‌ర్న్ లు తీసుకున్న చంద్ర‌బాబు.. ఎట్ట‌కేల‌కు హోదాతోనే త‌న‌కు మ‌ళ్లీ అధికారం ద‌క్కే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించి.. ఆ దిశ‌గా అడుగులు వేసే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టారు.

మ‌రోవైపు.. బాబు పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో అంత‌కంత‌కూ పెరుగుతున్న అసంతృప్తి.. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఒక‌సారి అవ‌కాశం ఇద్దామ‌న్న సానుకూల‌త‌ల‌తో పాటు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం ఎంత‌టి క‌ష్టాన్ని అయినా ఓర్చుకొని ముందుకు సాగుతాన‌న్న విష‌యాన్ని త‌న పాద‌యాత్ర‌తో మ‌రోసారి స్ప‌ష్టం చేస్తున్నారు.

జ‌గ‌న్‌.. బాబుల  మ‌ధ్య న‌డుస్తున్న రాజ‌కీయ పోరులో తాను ప్ర‌యోజ‌నం పొందొచ్చ‌న్న ఆలోచ‌న‌లో ఈసారి రూట్ మార్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్. పొత్తుల‌తోనే అధికారం ద‌క్కుతుంద‌న్న ఆశ‌లో ఆయ‌న ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. పైకి సొంతంగా పోటీ చేస్తామ‌న్న మాట చెబుతున్న‌ప్ప‌టికీ.. లోగుట్టుగా మాత్రం తాను జ‌త క‌ట్టే పార్టీల కోసం జ‌న‌సేన చాలా ఆశ‌గా ప్ర‌య‌త్నాల్ని చేస్తుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇందులో భాగంగా అధికార‌.. విప‌క్షాల్ని టార్గెట్ చేయ‌టం ద్వారా త‌న‌ను తాను ప్ర‌త్యేక నేత‌గా.. పార్టీగా ప్ర‌జ‌ల్లో గుర్తింపు పొందాల‌ని ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఏ విష‌యం మీదా ఎక్కువ కాలం ఉండ‌లేని ప‌వ‌న్ కు రాజ‌కీయాలు ఇబ్బందిగానే ఉన్నాయి. తాజాగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల్ని చూస్తే.. మూడు రోజులు గ‌ట్టిగా తిరిగితే.. మ‌రో నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవ‌టం.. ఎక్క‌డో ఒక‌చోట బ‌స చేయ‌టం లాంటివి చూస్తే.. ఇలాంటి నేత అలుపెర‌గ‌ని రీతిలో ప‌ని చేసే అవ‌కాశం ఉందా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.

రాజ‌కీయ ప్ర‌యోజ‌నమే ప‌ర‌మావ‌ధిగా భావిస్తున్న ప‌వ‌న్‌.. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా విమ‌ర్శ‌నాస్త్రాల్ని ఎక్కు పెడుతున్నారు. తాజాగా జ‌గ‌న్ మీద తీవ్ర‌వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ పుణ్య‌మా అని..రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. జ‌గ‌న్‌.. ప‌వ‌న్ ఇష్యూలో వీలైనంత వ‌ర‌కూ కామ్ గా ఉండాల‌ని.. అస్స‌లు జోక్యం చేసుకోవ‌ద్ద‌ని తెలుగు త‌మ్ముళ్ల‌కు బాబు స‌ల‌హా ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

జ‌గ‌న్‌.. ప‌వ‌న్ మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధంలో ప‌వ‌న్ కు అనుకూలంగా తెలుగు త‌మ్ముళ్లు గ‌ళం విప్పుతున్న నేప‌థ్యంలో అలెర్ట్ అయిన బాబు..త‌మ్ముళ్లు అస్స‌లు మాట్లాడొద్ద‌ని.. జ‌గ‌న్‌.. ప‌వ‌న్ వివాదంలోకి త‌ల‌దూర్చ‌వ‌ద్ద‌న్న సూచ‌న‌ను చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ కార‌ణంతోనే వీరి ఇష్యూలో వేలు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న స‌మాచారంతో వారంద‌రికి ముందుగానే అలెర్ట్ లు వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News