బాబు భ‌లే నిర్ణ‌యం తీసుకున్నారే

Update: 2015-11-09 09:26 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కొలువుల జాత‌ర‌కు తెర‌తీయ‌బోతోంది. ప‌రిపాల‌న ప‌గ్గాలు చేప‌ట్టి దాదాపు ఏడాదిన్న‌ర కావ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ కొలువుల నియామ‌కానికి శ్రీ‌కారం చుట్టాలని  ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నిర్ణయించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని చంద్ర‌బాబు ప్రాథ‌మికంగా ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు అన్ని శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఆయా శాఖల్లో అవసరాన్ని బట్టి నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు.

ఏపీలో చాలా కాలంగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేవు. ఔట్‌ సోర్సింగ్‌ - కాంట్రాక్ట్‌ ఉద్యోగాల్లో నియామకాలు చేస్తున్నప్పటికీ, అవి ఎప్పటి వరకు ఉంటాయో తెలియని పరిస్థితి. ఈ నేప‌థ్యంలో ఉద్యోగాల నియామ‌కం ద్వారా యువతను ఆకట్టుకునేందుకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంగా అధికారులు అభివర్ణిస్తున్నారు. ఎంపిక ప్ర‌క్రియ స‌జావుగా, వేగంగా పూర్త‌య్యేందుకే ఏపీపీఎస్‌ సీ ఛైర్మన్‌ - కార్యదర్శి పోస్టులను కూడా ఇటీవల భర్తీ చేశార‌ని చెప్తున్నారు. మ‌రోవైపు ఉద్యోగ నియామకాల గురించి ఇటీవల కార్యదర్శుల సమావేశంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి ఐవైఆర్‌ కృష్ణారావు చర్చించారు. ఖాళీలు భ‌ర్తీ చేయాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించారు. ఈ నేప‌థ్యంలో అన్ని శాఖల అధికారులు తమ తమ శాఖల్లో ఉన్న ఖాళీలు, అవసరాలపై నివేదికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

ఆయా శాఖలే నేరుగా తమ తమ శాఖల్లో ఖాళీల వివరాలను సిద్ధం చేసుకుని ఆర్థిక శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం వాటి భర్తీకి ఏపీపీఎస్‌ సీ నోటిఫికేష‌న్స్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. యువ‌త ఆకాంక్ష‌లో కోణంలో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకున్నా, అవి ఆర్థిక పరిస్థితిని బట్టి ఉండాలని ప్ర‌భుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో అత్యవసరమైన ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కానీ అన్నింటినీ భర్తీ చేయకుండా ప్రతి శాఖల్లో కొన్ని అవసరమైన పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆర్థిక శాఖ అనుమతించే పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణ‌యం తీసుకున్నారు.
Tags:    

Similar News