సీఎం రేవంత్ సీరియస్.. ఎస్ బీఐ ఇష్యూలో తగ్గేదే లేదట

గతంలోని ప్రభుత్వాలు కేటాయించిన భూమిని.. నిర్ణీత వ్యవధిలో దానిని డెవలప్ చేసే విషయంలో ఎస్ బీఐను వేలెత్తి చూపిస్తున్నారు.

Update: 2026-06-22 07:56 GMT

రాయదుర్గం భూమల వేలం.. దీనికి ఎస్ బీఐ స్పందించిన తీరు.. గతంలో తమకు కేటాయించిన భూముల్ని ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందన్న అంశంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన వైనానికి సంబంధించి గడిచిన మూడు రోజులుగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేటాయించిన తర్వాత.. మళ్లీ ఎలా వేలం వేస్తారు? అన్న ప్రశ్న ఒకటైతే.. అందుకు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరోలా ఉంది. మొత్తంగా ఎస్ బీఐ హైకోర్టును ఆశ్రయించటం వెనుక చాలానే కథ ఉందని.. అందులో రాజకీయ కోణాలు చాలానే ఉన్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. మొత్తంగా ఒక జాతీయ బ్యాంక్ కు.. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చోటు చేసుకున్న భూ వివాదం ఇప్పుడు అనూహ్య మలుపులకు కారణమవుతోంది.

గతంలోని ప్రభుత్వాలు కేటాయించిన భూమిని.. నిర్ణీత వ్యవధిలో దానిని డెవలప్ చేసే విషయంలో ఎస్ బీఐను వేలెత్తి చూపిస్తున్నారు. అయితే.. ఇతర అంశాలతోనే ఎస్ బీఐ తెలంగాణలోని రేవంత్ సర్కారును ఇరుకున పడేసేందుకు వీలుగా పావులు కదుపుతోందన్న వాదన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినిపిస్తోంది. ఈ విషయంలో వాస్తవాల్ని వివరించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తాజా ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకుంటారన్న మాట బలంగా వినిపిస్తోంది.

అదే సమయంలో ఎస్ బీఐ మీద చర్యల పరంపర కంటిన్యూ అయ్యేలా ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ బీఐకు చెందిన అన్ని ప్రభుత్వ లావాదేవీల్ని ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును వాయువేగంతో పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం వేలం వేసిన భూముల విషయంలో ఎస్ బీఐ కొర్రీలు పెట్టిన తీరు..హైకోర్టును ఆశ్రయించిన వైనంపై రేవంత్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా తమ ప్రభుత్వంపై ఎస్ బీఐ వేసిన కేసుకు ప్రతిగా.. సదరు సంస్థపై ఒత్తిడి పెరిగేలా.. ప్రభుత్వం అమలు చేసే పలు పథకాలు.. మ్యాచింగ్ గ్రాంట్ల కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఎక్కువగా ఎస్ బీఐలోనే పెడుతుంటారు. అలా ఎస్ బీఐ వద్ద తాము డిపాజిట్ చేసిన మొత్తాల్ని తక్షణం విత్ డ్రా చేసుకోవాలన్న ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు చెబుతున్నారు.

అంతేకాదు.. తమ ప్రభుత్వ పరిధిలోని పలు కార్పొరేషన్లు.. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధించి వందల కోట్ల రూపాయిల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఎస్ బీఐలో ఉన్నట్లుగా గుర్తించిన ప్రభుత్వం.. వాటిని కూడా వడ్డీతో సహా సదరు బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వానికి లీడ్ బ్యాంక్ గా ఉన్న ఎస్ బీఐ హోదాను సైతం పక్కన పెట్టేసేందుకు వీలుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశంపైనా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇలా.. తమను కేసుతో ఇరుకున పెట్టిన ఎస్ బీఐ విషయంలో అమీతుమీ తేల్చుకోవాలన్నట్లుగా సీఎం రేవంత్ వైఖరి ఉందని చెబుతున్నారు. రాయదుర్గం భూమల వేలం విషయంలో తమ ప్రభుత్వం తప్పు చేయలేదన్నది రేవంత్ సర్కారు వాదన. వేలానికి సంబంధించిన సమాచారాన్ని సదరు సంస్థలకు తెలియజేయటంతో పాటు.. అందుకు దారి తీసిన కారణాల్ని వెల్లడించిన తర్వాత కూడా కొందరి మాటల ప్రభావానికి లోనై తమను ఇరుకున పడేలా చేసిన ఎస్ బీఐకు.. తామేం చేయగలమో అవన్నీ చేసి చూపించాలన్న ‘ఆర్డర్’ రేవంత్ సర్కార్ నుంచి అంతర్గతంగా ఇప్పటికే సర్క్యులేట్ అయినట్లుగా తెలుస్తోంది. మరి.. ఈ అంశంలో స్టేట్ బ్యాంక్ ఇప్పటివరకు తమ వాదనను పత్రికా ముఖంగా వెల్లడించింది లేదు. మొత్తానికి నాటకీయ మలుపులు తిరుగుతున్న ఈ ఎపిసోడ్ చివరకు ఎక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News