బాబు నోట హైదరాబాదీలకు మంట పుట్టే మాట

Update: 2015-07-21 04:36 GMT
ఏపీ ముఖ్యమంత్రి మరో పెద్ద తప్పు చేశారు. ఏదైనా వ్యాఖ్యలు చేసే సమయంలో ఆచితూచి మాట్లాడే బాబు.. ఈసారి అడ్డంగా బుక్ అయ్యేలా.. హైదరాబాదీలు మండిపడేలా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా రాజమండ్రిలో ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

హైదరాబాద్ ను తానెంతో అభివృద్ధి చేశానని.. హైదరాబాద్ ను హైటెక్ నగరిగా.. ప్రపంచంలో సరికొత్త పేరుప్రఖ్యాతుల్ని తెచ్చిన విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావిస్తుంటారు. ఈ వ్యాఖ్యల్లో నిజం ఉన్నందున.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు బాబుపై ఎన్ని విమర్శలు చేసినా లైట్ తీసుకుంటారు. హైదరాబాద్  కు సరికొత్త ఇమేజ్ తీసుకురావటంలో చంద్రబాబు కీలకమన్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేనిది.

ఎప్పడూ హైదరాబాద్ కు అంత చేశాం.. ఇంత చేశామని చెప్పే బాబు.. ఈసారి మాత్రం హైదరాబాదీయులకు ఒళ్లు మండే మాటను మాట్లాడి.. కొత్త వివాదానికి తెర తీశారు. హైదరాబాదీయులకు ఉదయాన్నే నిద్ర లేచే అలవాటు పరిచయం చేసింది స్వర్గీయ ఎన్టీఆరే అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో జనం ఆలస్యంగా నిద్ర పోయి.. ఆలస్యంగా నిద్ర లేచేవారని.. కానీ.. ఎన్టీఆర్ మాత్రం వారికి ఉదయాన్నే నిద్ర లేవటం నేర్పించారంటూ ఎక్కడో తగిలే మాటల్ని మాట్లాడారు.

హైదరాబాదీయులు బాగా పని చేయాలని.. శారీఃరక శ్రమ చేయకున్నా.. మెదడుకు పని చెబితే చాలన్న వ్యాఖ్య చేశారు. కాలం చేసిన పెద్ద మనిషి పేరు మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటంటూ బాబు మీద పలువురు ఫైర్ అవుతున్నారు. మెదడుతో పని చేయాలంటున్న బాబు.. మొదట ఆయన ఆ పని చేస్తే బాగుంటుందని ధ్వజమెత్తుతున్నారు. సెంటిమెంట్లను రేపే మాటలు అవసరమా చంద్రబాబు..?
Tags:    

Similar News